న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి భారీ రాకెట్లను పంపుతున్నాం. పర్వతాలను కలుపుతూ హైవేలను కడుతున్నాం. అయితే హిమాచల్ ప్రదేశ్లోని ఓ కుగ్రామం ‘తుమన్’కు రోడ్డు మార్గాన్ని వేసి.. ఆ ఊరికి బస్సును పంపడానికి 78 ఏండ్లు పట్టింది. మండీ జిల్లాలో షాకెల్డ్-తుమన్ మధ్య 2.7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తవటంతో.. బస్సులు, వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది.
సోమవారం తొలిసారి ఓ బస్సు తమ ఊరికి రావటంతో స్వీట్లు పంచుకుంటూ ప్రజలు సంబురాలు చేసుకున్నారు. జిల్లా అధికారులు, గ్రామస్తులు ఆ బస్సుకు ఘనంగా స్వాగతం పలుకడం వార్తల్లో నిలిచింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా కనీస రోడ్డు వసతి, బస్సు సౌకర్యం లేక ఆ ఊరివాళ్లంతా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.