న్యూఢిల్లీ: భారత్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) హెచ్చరించింది. 26 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు విద్యా సంస్థలు ఉన్న చోటనే చోటుచే సుకున్నాయని తెలిపింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఐఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో డీజీ సారంగి మాట్లాడుతూ జాతీయ రహదారులపై అన్ని దశలలో రోడ్డు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదని చెప్పారు. ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ప్రకారం దేశంలో నిరుడు మొత్తం 5.7 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, చాలా ప్రమాదాలకు అతివేగమే కారణమని ఆయన చెప్పారు.
55% ట్రక్ డ్రైవర్లకు దృష్టి లోపం
దేశంలో 55 శాతం డ్రైవర్లకు దృష్టి లోపం ఉందని మంగళవారం విడుదలైన ఐఐటీ ఢిల్లీ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 53.3% మందికి దూర దృష్టి దిద్దుబాటు అవసరం కాగా, 46.7 శాతం మందికి దగ్గరి దృష్టి సమస్యలపై చికిత్స అవసరం అని తేలింది. 44.3 శాతం డ్రైవర్లు బీఎంఐ స్థాయికి పైన లేదా దానికి సరిహద్దులో ఉన్నారు. 57.4 శాతం మందికి రక్తపోటు ఉండగా, 18.4 శాతం తీవ్ర డయాబెటిస్తో బాధ పడుతున్నారు.
పెట్రోల్, డీజిల్ వాహనాలకు చెల్లు!
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో పెట్రోలు, డీజిల్ వాహనాలను నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. గాలి నాణ్యత దయనీయ స్థితికి చేరుతుండటంతో, కేవలం సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని భావిస్తున్నది. దీనిని పరిశీలించడం కోసం ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.