Road Accident | ఆటో మరో వాహనాన్ని ఓవర్‌టెక్ చేస్తున్న సమయంలో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్‌లో ఆదివారం జరిగింది. భగత్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలీగంజ్ – దల్పత్పూర్ రోడ్డుపై ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. వివారల్లోకి వెళితే.. భోజ్పూర్లోకి కోర్వా గ్రామానికి చెందిన పలువురు రాంపూర్‌లోని ఖేంపూర్కు ఆటోలో 16 మంది వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు.
ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో భగత్పూర్ ప్రాంతంలోని ఖైర్‌ఖాతా గ్రామం సమీపానికి చేరుకున్న సమయంలో ముందున్న వాహనాన్ని ఆటో ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. దల్పత్పూర్ నుంచి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడ్డాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని భోజ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో మొత్తం పది మంది మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు దవాఖానకు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.