లక్నో : ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రాజకీయ పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. యోగి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ఆయన పాలన ప్రజలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌధరి ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన ఆర్ఎల్డీ యోగి సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది.
రైతులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. మందిర్, మండల్ రాజకీయాలతోనే యూపీ వెనుకబాటుకు గురైందని అన్నారు. పేదరికం, పోషకాహారం, మౌలిక వసతుల లేమి వంటి సమస్యల్లో రాష్ట్రం కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు చట్టాలను అనివార్య పరిస్ధితుల్లోనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉందని జయంత్ చౌధరి వ్యాఖ్యానించారు.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం నిలుపుకునేందుకు యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుండగా, పాలనా పగ్గాలు చేపట్టాలని అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఎస్పీ సైతం చెమటోడుస్తోంది. మరోవైపు ప్రియాంక గాంధీ నేతృత్వంలో మెరుగైన ఫలితాలు రాబట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది.