ప్రతిపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ పోరు ముదురుతున్నది. ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్‌గాంధీ నాయకత్వ పటిమపై కూటమి భాగస్వామ్య పార్టీల్లో నమ్మకం సడలింది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్‌ను నమ్ముకుంటే తామూ మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నయంగా మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇప్పటికే సమాజ్‌వాదీ, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్), శివసేన (యూబీటీ) మమతకు మద్దతు తెలుపగా, తాజాగా ఈ జాబితాలో ఆర్జేడీ కూడా చేరింది. తటస్థ పార్టీ అయిన వైఎస్సార్ సీపీ కూడా మమతకు మద్దతు తెలపడం గమనార్హం. ఇండియా కూటమిలో తమ నాయకత్వానికి ఎసరు వస్తుండటంతో కాంగ్రెస్.. మమతపై ఎదురుదాడిని ప్రారంభించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఇండియా కూటమిలో నాయకత్వ లొల్లి ముదురుతున్నది. ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి పార్టీల్లో నమ్మకం సడలింది. హస్తం పార్టీ నేతృత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమే అనే భావనకు ప్రతిపక్ష కూటమి పార్టీలు వచ్చేశాయి. ఇంకా కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వంలో నడిస్తే తామూ మునిగిపోతామని ఆయా పార్టీల నేతలు మథనపడుతున్నారు. ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు. అవకాశం ఇస్తే ఇండియా కూటమిని నడిపిస్తానని మమత చేసిన వ్యాఖ్యలకు కూటమి పార్టీల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ(శరద్చంద్ర పవార్), శివసేన(యూబీటీ) నాయకులు మమత నాయకత్వాన్ని ఆహ్వానించారు. ఇండియా కూటమి పగ్గాలు ఆమెకు అప్పగించాలనే డిమాండ్‌ను వినిపించారు. తాజాగా ఈ జాబితాలో ఆర్జేడీ కూడా చేరింది.
ఇండియా కూటమి నాయకత్వంపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మమతా బెనర్జీకి మేము మద్దతు ఇస్తాం. ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి ఆమెకు అనుమతి ఇవ్వాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. మమత నాయకత్వానికి కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుందా? అని ఆయనను ప్రశ్నించగా.. కాంగ్రెస్ వ్యతిరేకించడం సమస్యేమీ కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. మరోవైపు ఆర్జేడీ కీలక నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ సైతం ఇండియా కూటమిని మమత నడిపించడానికి తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయం ఏకాభిప్రాయం ద్వారానే జరగాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇంతకాలం ఇండియా కూటమి, ఎన్డీఏలో లేకుండా తటస్థంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మమతా బెనర్జీకి మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు మమత సరైన వ్యక్తి అని, 42 లోక్‌సభ స్థానాలు కలిగిన పెద్ద రాష్ర్టానికి ఆమె ముఖ్యమంత్రి అని, ఎన్నికల్లో ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఇండియా కూటమిలోని పార్టీల మద్దతుతో తృణమూల్ కాంగ్రెస్ సైతం స్వరం పెంచింది. కాంగ్రెస్ పార్టీ తన అహాన్ని పక్కన పెట్టి ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి విఫలమైందని ఆ పార్టీ అర్థం చేసుకోవాలి. మమతకు రాజకీయ యుద్ధాల్లో ఎలా పోరాడాలో తెలుసు. కాంగ్రెస్ పార్టీ తన అహంతో మమతను వదులుకున్నది. ఇప్పుడు ఆమె ఎలా రాజకీయాల్లో రాణిస్తున్నారో చూస్తున్నాం. మమతకు ఇండియా కూటమి నాయకత్వాన్ని అప్పగిస్తే చాలా మేలు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇండియా కూటమిలో తమ నాయకత్వానికి ఎసరు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. దీంతో మమతా బెనర్జీపై ఎదురుదాడిని ప్రారంభించింది. మమతకు ఇండియా కూటమి నాయకత్వం అప్పగించాలనే సూచనను ‘జోక్’గా కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అభివర్ణించారు. బెంగాల్ బయట తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలను సాధించిందని ఆయన ప్రశ్నించారు. గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఏం సాధించిందో తృణమూల్ స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.