RJD MP : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని సత్వరమే దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. నిర్భయ కేసు అనంతరం కూడా దేశం మేలుకోకపోవడం తనను బాధిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను నిందించడం సులభమని, ప్రభుత్వాల పాత్ర ఉన్నా సమాజంగా మన పాత్రనూ విస్మరించలేమని పేర్కొన్నారు.
మనం క్రూరత్వం వైపు మళ్లామని, మనం దౌర్భల్యానికి లోనయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై లైంగిక దాడి జరిగిందని ఇది తీవ్రమైన విషయమని అన్నారు. దీన్ని సహించరాదని, సమాజంలో మన పాత్ర ఏంటనే దానిపై మనం కూడా ఆలోచించాల్సిన సమయం ఇదని మనోజ్ ఝా పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది.
ఈ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ, ఎఫ్ఎస్ఎల్ బృందాలు బుధవారం మధ్యాహ్నం మహిళా వైద్యురాలి హత్యాచార ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకున్నాయి. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దర్యాప్తు బాధ్యతను స్వీకరించిన వెంటే సీబీఐ ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందాన్ని ఘటనా ప్రాంతానికి పంపింది. ఇక కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నది. ఈ కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read More :
Adipurush | ఆదిపురుష్ ఫ్లాప్ అయినప్పుడు ఏడ్చాను : కృతి సనన్