న్యూఢిల్లీ : 2025లో కృత్రిమ మేధస్సు(ఏఐ)పై చాలామంది అభిప్రాయం ఒక్కటే.. దీనిని అంగీకరిస్తే మీ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. మానవ ఉద్యోగికి కంపెనీ చెల్లించాల్సిన దానికంటే ఏఐ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఏఐ ఉత్పాదకతను పది రెట్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచుతుంది. కానీ 2026లో ఏఐ వాస్తవికత మరోలా ఉన్నది. ఉత్పాదకత పది రెట్లు పెరుగడానికి బదులు ఏఐ ఖర్చు విపరీతంగా పెరిగింది. క్లాడ్ వంటి ఏఐ టూల్స్ ఉపయోగించడం కంటే సమర్థుడైన ఒక ఉద్యోగికి జీతం ఇవ్వడమే చౌక అని కొందరు పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ఏఐకి సంబంధించిన ఖర్చుల సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే మైక్రోసాఫ్ట్, ఉబర్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ ఏఐ ఖర్చులను సమర్థించుకోవడానికి కష్టపడుతున్నాయి. గతవారం వచ్చిన కొన్ని నివేదికలు ఏఐ వల్ల వచ్చే ప్రయోజనాలు, దానికి అవుతున్న ఖర్చులకు మధ్య ఉన్న అసమతుల్యతను కంపెనీలు గమనించడం ప్రారంభించాయని పేర్కొన్నాయి. మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ వేలాది మంది ఇంజినీర్లను క్లాడ్ కోడ్ వాడడం ఆపేసి అంతర్గత ఏఐ టూల్‌ను ఉపయోగించాల్సిందిగా కోరింది. దీనికి జూన్ 30ని గడువుగా విధించారు. తమ ఉద్యోగులపై క్లాడ్ కోడ్‌ను రుద్దిన కేవలం కొన్ని నెలలకే మైక్రోసాఫ్ట్ ఎందుకు ఆంత్రోపిక్ టూల్ నుంచి తప్పుకొంటున్నదో బహిరంగంగా వ్యాఖ్యానించనప్పటికీ ఉద్యోగులు క్లాడ్ కోడ్ టోకెన్ల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తుండడమే దీనికి కారణమని నివేదికలు సూచిస్తున్నాయి.
ఉబర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ కంపెనీ ఏఐ ఖర్చుల కోసం కొంత బడ్జెట్‌ను కేటాయించింది. ఆ తర్వాత జనవరిలో తన 5000 మంది ఇంజినీర్లకు క్లాడ్ కోడ్ యాక్సెస్‌ను అందించింది. కొన్ని వారాల క్రితం ఉబర్ సీటీవో ప్రవీణ్ నాగా మాట్లాడుతూ.. ఉబర్ తన మొత్తం వార్షిక ఏఐ బడ్జెట్‌ను కేవలం 5 నెలల్లోనే ముగించేసిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉబర్ సీవోవో ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీకరించారు. ఏఐ వినియోగం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఉత్పాదకత పెరుగలేదని హైలైట్ చేస్తూ “మనం టోకెన్ వినియోగం, దానికి అయ్యే ఖర్చులను ఉద్యోగుల సంఖ్యతో పోల్చి మాట్లాడడం ప్రారంభించాల్సి ఉంటుంది. మీరు మీ వినియోగదారులకు ఎంత ఉపయోగకరమైన ఫీచర్లను అందిస్తున్నారనే దానికి, ఈ ఖర్చుకు నేరుగా సంబంధం చూపించలేకపోతే, ఈ వ్యయాన్ని సమర్థించడం కష్టమవుతుంది” అని అన్నారు. ప్రస్తుతం సొంత ఏఐ స్టార్టప్ నడుపుతున్న ఇన్ఫోసిస్ మాజీ అధినేత విశాల్ సిక్కా దీనిపై ‘ఎక్స్’లో స్పందించారు. “టోకెన్ ఖర్చులు నిజమైన సమస్యగా మారుతున్నాయి. భవిష్యత్తులో ఏఐ వినియోగంపై మరింత నిఘా ఉంటుంది” అని ఆయన అన్నారు.

ఏఐ స్టార్టప్ ‘ఫెక్సో జెన్ ఏఐ’ వ్యవస్థాపకుడు, సీఈవో కౌస్తుబ్ కశ్యప్ మాట్లాడుతూ.. “మైక్రోసాఫ్ట్, ఉబర్ బడ్జెట్ పరిమితులు దాటిపోవడం ఒక మార్పునకు సంకేతం. ఏఐ ప్రయోగాలు ముగిశాయి. వాస్తవికత మొదలైంది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు పెట్టుబడిపై రాబడిని కూడా మూల్యాంకనంలో భాగం చేయాలి” అని అన్నారు. ఏఐ వాడుతున్నవారు ఎక్కువగా వినే పదం టోకెన్. ఏఐ టూల్స్ ఇన్పుట్, అవుట్‌పుట్‌లను కొలిచే యూనిట్నే టోకెన్లు అంటారు. ఇది విద్యుత్ యూనిట్లాంటిది. దీనిని మీటర్ చేయవచ్చు. 2026లో గూగుల్, ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐలపై ఏఐకి సంబంధించిన ఆదాయాన్ని చూపించాలనే ఒత్తిడి పెరుగుతుండడంతో, అవి తమ క్లయింట్ల కోసం టోకెన్ ఆధారిత ధరల విధానానికి మారుతున్నాయి. ఇంతకుముందు ధరల విధానంలో ఏఐ కంపెనీలు సబ్సిడీ ఇచ్చేవి. నెలకు కేవలం 200 డాలర్లు చెల్లించే వినియోగదారుడి కోసం క్లాడ్, చాట్ జీపీటీలను రన్ చేయడానికి దాదాపు 1500 నుంచి 5000 డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. క్లాడ్ నుంచి జెమిని వరకు అందరూ స్థిరమైన నెలవారీ లేదా వార్షిక రుసుముకు బదులుగా టోకెన్ ఆధారిత ధరలకు మారుతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ సమయంలో టోకెన్ ఆధారిత ధరలు పని చేయవచ్చు. కానీ వేలాది మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు దీనిని కొనసాగించడం చాలా కష్టం అని కశ్యప్ అంటున్నారు. ఏఐతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించిన ఎన్విడియా కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నది. ఎన్విడియా ఐప్లెడ్ డీప్ లెర్నింగ్ వైస్ ప్రెసిడెంట్ బ్రయాన్ ఇటీవల మాట్లాడుతూ‘ ‘ఏఐ ఖర్చు, ఉద్యోగుల ఖర్చు కంటే చాలా ఎక్కువగా ఉంది” అని పేర్కొన్నారు. ఆయన ప్రకారం.. క్లాడ్ కోడ్ టోకెన్లపై ఆధారపడడం కంటే ఉద్యోగిని నియమించుకోవడం చౌక కావచ్చు.
పెరుగుతున్న ఖర్చుల వల్ల ఏఐ హైప్, బూమ్ ముగిసిపోతుందని పరిశ్రమ నిపుణులు అనడం లేదు. అలాంటి పరిస్థితికి చాలా దూరంగా ఉన్నాం. కానీ ఇది కంపెనీలలో ఏఐ వ్యూహాల పునఃసమీక్షకు దారి తీసే అవకారం ఉన్నది. ఇంగ్రామ్ మైక్రో క్లౌడ్ సొల్యూషన్స్ హెడ్ సునీల్ గోలాని మాట్లాడుతూ.. ఏఐని స్వల్పకాలిక ఖర్చు తగ్గింపు సాధనంగా కాకుండా వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలని అన్నారు. ఏఐకి ఎంత ఖర్చు అవుతుంది అనేది కాదు, అది ఏ వ్యాపార విలువను తెచ్చి పెడుతుందనేది ముఖ్యమని చెప్పారు. ఖర్చులు పెరుగడం వల్ల కంపెనీలు ఇష్టం వచ్చినట్టు ఏఐని వినియోగించడంపై పునరాలోచించుకోవాలని జైస్ ఇండియా సీఎఫ్‌వో ధవల్ రాడియా సూచించారు. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ విజయ్ గోపాలకృష్ణన్ మాట్లా డుతూ కంపెనీలు అన్నింటికీ ఒకే పద్ధతిని ఉపయోగించకుండా ఏఐ కోసం సరైన వ్యాపార వినియోగ కేసులను ఎంచుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు.