న్యూఢిల్లీ, మార్చి 31 : మైనారిటీలపై హింసకు సంబంధించి 2014-15 నుండి 2024-25 వరకు జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్సీఎం)కు 568 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 251 ఫిర్యాదులు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుండే అందాయి. డీఎంకే ఎంపీ పీ విల్సన్, సీపీఎం ఎంసీ జాన్ బ్రిట్టాస్ ప్రశ్నకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఈ మేరకు సమాధానమిచ్చారు. మైనారిటీలపై జరిగే హింసకు సంబంధించిన నిర్దిష్టమైన వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండవని, ఆ ఫిర్యాదులను ఎన్సీఎం పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులపై తదుపరి చర్యల కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నివేదిస్తామని ఆయన వెల్లడించారు. విల్సన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిస్తూ గడచిన 11 ఏండ్లలో ఎన్సీఎంకు 568 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిలో యూపీ తర్వాత స్థానంలో 80 ఫిర్యాదులతో ఢిల్లీ ఉందన్నారు. మధ్యప్రదేశ్, హర్యానా నుంచి 33 ఫిర్యాదులు, కేరళ నుంచి 20 ఫిర్యాదులు అందాయని తెలిపారు.