High Court | శ్రీనగర్, నవంబర్ 28: ఆస్తిపై హక్కు ఇప్పుడు మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని జమ్ము కశ్మీర్, లఢక్ హైకోర్టు స్పష్టం చేసింది. 1978 నుంచి ఆక్రమించుకుని ఉన్న భూమికి సంబంధించి పిటిషనర్‌కు 46 ఏండ్ల అద్దె బకాయిలను నెల రోజుల్లో చెల్లించాలని భారత ఆర్మీని ఆదేశిస్తూ జస్టిస్ వాసిమ్ సిద్ధిఖీ నార్గల్ తీర్పు చెప్పారు.
‘ఆస్తిని కలిగి ఉండటం రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కే కాదు, ఇప్పుడది మానవ హక్కుల పరిధిలోకీ వస్తుంది. నేడు మానవ హక్కులు బహుముఖ కోణాన్ని సంతరించుకున్నాయి’ అని జడ్జీ పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే అబ్దుల్ మాజీద్ అనే వ్యక్తికి కుప్వారా జిల్లాలో ఉన్న 1.6 ఎకరాల భూమిని ఆర్మీ 1978లో స్వాధీనం చేసుకుని తన అవసరాలకు వాడుకుంటున్నది.
దీనికి అతనికి ఎలాంటి అద్దె కానీ, పరిహారం కానీ చెల్లించకపోవడంతో ఆయన 2014లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టానికి లోబడి తప్ప ఒక వ్యక్తికి చెందిన ఆస్తులను ప్రభుత్వం కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ స్వాధీనం చేసుకోలేవు అని న్యాయస్థానం ఈ కేసు సందర్భంగా స్పష్టం చేసింది.