న్యూఢిల్లీ, జనవరి 9: భారత్‌లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం తగ్గుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎమ్‌డీ) అంచనా వేసింది. ఇది చౌక ధరల ఆహారంపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర జలాలు వేడెక్కి చేపల లభ్యత తగ్గిపోతుందని, ఇది మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని ఐఎండీ సీనియర్ అధికారులు తెలిపారు. సముద్ర జలాలు ఉపరితలంలో వేడెక్కడం వల్ల చేపలు సముద్రం లోపలికి వెళ్లిపోతుండటమే ఇందుకు కారణమని వారు వెల్లడించారు. జాతీయ ఆవిష్కరణల సంస్థ అంచనా ప్రకారం వరి దిగుబడి 2050 నాటికి 7 శాతం, 2080 నాటికి 10 శాతం తగ్గనుంది. అలాగే 2100 నాటికి దేశంలో గోధుమల దిగుబడి 6-25 శాతం తగ్గనుంది. హిమాలయాల్లో మంచు కరగడం పెరుగుతున్నదని, మంచు పేరుకోవడం తగ్గుతున్నదని… పశ్చిమ అలజడులే ఇందుకు కారణమని ఐఎండీ డీజీ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. నీటి లభ్యత తగ్గిపోనుండటం వల్ల దాని ప్రభావం భారత్, చైనాలోని 200 కోట్ల మంది ప్రజలపై పడుతుందని ఆయన హెచ్చరించారు.