న్యూఢిల్లీ: దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతున్నది. దాంతో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. అందులో భాగంగా తాజాగా బియ్యం పరిశ్రమలకు కఠిన ఆదేశాలను జారీ చేసింది.
దేశీయ మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. బియ్యం ధరల కట్టడికి ఉపక్రిమించింది. ఆ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రెటరీ సంజీవ్ చోప్రా రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బాస్మతీయేతర బియ్యం ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చోప్రా కోరారు.
దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద రూ.29 కే ప్రాసెసర్లకు అందజేస్తున్నారని, ప్రాసెసర్లు అదే బియ్యాన్ని మార్కెట్లో రూ.43 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఆదేశాలు జారీచేస్తున్నామని సమావేశంలో సంజీవ్ చోప్రా వ్యాఖ్యానించారు. కాగా, గత జూలైలో బియ్యం ధరలను తగ్గించడానికి ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఎగుమతి సుంకాలను 20 శాతం వరకు పెంచింది.