కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు మరో వివాదం చుట్టుకున్నది. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘తృణమూల్ భవన్’ను ఖాళీ చేయాలని బిల్డింగ్ యజమాన్యం డిమాండ్ చేసింది. (Trinamool headquarters) కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఐదు అంతస్తుల భవనం 2022 మే నుంచి టీఎంసీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నది. ఆ బిల్డింగ్ మోడరన్ డెకరేటర్స్ యజమాని ఎస్.కె. ఇనాముర్ రెహమాన్‌కు చెందినది. గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అనేక ప్రభుత్వ కాంట్రాక్టులను ఈ సంస్థ దక్కించుకున్నది.
కాగా, ఆ భవనం లీజు గడువు ముగిసిందని, రెండు నెలల్లోగా టీఎంసీ ఖాళీ చేయాలని యాజమాన్యం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు తర్వాత తమ ఆస్తి భద్రతపై భవన యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎంసీతో చేసుకున్న ఒప్పందం 2026లో ముగుస్తుందని ఆ సంస్థ తరుఫు న్యాయవాది తెలిపారు. అయితే 2025 అక్టోబర్ తర్వాత పార్టీ ప్రతినిధులు అందుబాటులో లేరని ఆరోపించారు. ఈ నేపథ్యంలో లీజు వివాదం అంశంపై ప్రగతి మైదాన్ పోలీస్ స్టేషన్‌ను యజమాన్యం ఆశ్రయించినట్లు వివరించారు.
మరోవైపు టీఎంసీ ప్రధాన కార్యాలయమైన ‘తృణమూల్ భవన్’ లీజు ముగిసిందన్న ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. యజమానితో పార్టీ చేసుకున్న ఒప్పందం చెల్లుబాటులో ఉన్నదని ‘తృణమూల్ భవన్’ సంరక్షకుడు సుబీర్ మజుందార్ తెలిపారు. 2027 వరకు లీజు ఒప్పందం అమల్లో ఉంటుందని చెప్పారు. అయితే కొత్త ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే లీజు గడువు ముగిసినట్లుగా చిత్రీకరించడానికి యజమాని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే, తృణమూల్ భవనం నుంచి ఫర్నిచర్‌ను తరలిస్తున్నారు. అలాగే పార్టీ రంగుల స్థానంలో కొత్తగా పెయింటింగ్ వేస్తున్నారు. దీంతో టీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని వేరే చోటుకు మారుస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ దీనిపై స్పందించారు. టాప్సియాలోని అసలు పార్టీ ప్రధాన కార్యాలయం పునర్నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. ఈ భవనాన్ని తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా మాత్రమే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ‘ఇప్పుడు అసలు ప్రధాన కార్యాలయం దాదాపు సిద్ధమైంది. మా నాయకత్వం భవన యజమానితో చర్చలు జరుపుతోంది. ఇరు పక్షాల మధ్య ఉన్న ఒక పరస్పర వ్యవహారం ఇది’ అని ఆయన అన్నారు.