న్యూఢిల్లీ, మార్చి 4: భార్య కార్యేషు దాసి అని, ఎల్లవేళలా భర్తకు విధేయురాలై ఉండాలని భారత్లో 87% మంది భావిస్తున్నారు. అదే సమయంలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులు ఉండాలని వాదిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2019-20 మధ్యలో దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 17 భాషల్లో ఈ సర్వే నిర్వహించారు. దేశంలో లింగ భేదాలు, కట్టుబాట్లు, సంఘ నియమాలపై 30వేల మందిని ప్రశ్నించారు. ఉద్యోగం పురుష హక్కు అని 80 శాతం మంది సమాధానం ఇచ్చారు. ‘పురుషులతో పోలిస్తే మహిళలకు సమాన హక్కులు ఉండాలని చెప్పినవారిలో చాలా మంది సమానమైన పరిస్థితుల్లో పురుషులకే ప్రాధాన్యం ఉండాలన్నారు’ అని సర్వే నివేదిక పేర్కొన్నది. కుటుంబంలో కనీసం ఒక్క కొడుకైనా ఉండాలని 90% మంది చెప్పగా, తల్లిదండ్రులకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత కొడుకులదే అని 63% మంది పేర్కొన్నారు.