హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. ఎన్రోల్మెంట్ గణనీయంగా పడిపోతున్నది. 2025-26 వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 23,198 పాఠశాలలు ఉండగా.. వీటిలో ఏకంగా 17,414 పాఠశాలల్లో 100 మంది లోపే విద్యార్థులు ఉన్నారు. మొత్తం పాఠశాలల్లో 75 శాతానికి పైగా బడుల్లో ఎన్రోల్మెంట్ 100లోపే ఉందన్నమాట. మరో ఆందోళనకర అంశం ఏమిటంటే.. 1 నుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలే 7,629 ఉన్నాయి. వీటిలో 7,469 ఎలిమెంటరీ పాఠశాలలు, 160 సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతి మూడు పాఠశాలల్లో ఒకటి ఈ క్యాటగిరీలోనే ఉన్నది.
ఇంత తకువ మంది విద్యార్థులతో సర్కార్ పాఠశాలలు డీలాపడిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 30 మంది లోపున్న బడులు 7,629 ఉండగా, 31 నుంచి 100 మంది విద్యార్థులున్న బడులు 9,785 ఉన్నాయి. ఈ రెండు క్యాటగిరీలను కలిపితే 100 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 17,414కు చేరాయి. అంటే రాష్ట్రంలోని మొత్తం 23,198 పాఠశాలల్లో సుమారు 75.1% బడుల్లో విద్యార్థుల సంఖ్య 100 దాటడం లేదన్నమాట. గణాంకాలేమో ఇలా ఉంటే.. ప్రభుత్వమేమో ఎన్రోల్మెంట్ పెరిగినట్టు చెప్తున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో 30వేల ఎన్రోల్మెంట్ తగ్గినట్టు లెక్కలు చెప్తున్నాయి. ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో అదనంగా కొందరు విద్యార్థులు చేరినా ఇదే విద్యార్థులను అటు అంగన్వాడీలో, ఇటూ పాఠశాల విద్యలోనూ చూపిస్తున్నట్టు ఉదంతాలున్నాయి.
రాష్ట్రంలో ఎలిమెంటరీ పాఠశాలల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నది. మొత్తం 17,702 ఎలిమెంటరీ పాఠశాలల్లో 1 నుంచి 30 మంది విద్యార్థులున్నవి 7,469 కాగా.. 31 నుంచి 100 మంది ఉన్నవి 7,959. అంటే 15,428 పాఠశాలల్లో 100 మంది లోపే విద్యార్థులున్నారు. ఇది మొత్తం పాఠశాలల్లో 87శాతంగా ఉండటం గమనార్హం.
ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న బడులు తక్కువగా ఉన్నాయి. 251నుంచి వెయ్యి మంది విద్యార్థులున్న పాఠశాలలు 1,469 ఉండగా, వెయ్యి మందికిపైగా విద్యార్థులున్నవి కేవలం 28 పాఠశాలలు మాత్రమే. మొత్తం పాఠశాలల్లో 251 మందికి పైగా విద్యార్థులున్నవి 1,497 మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య, పాఠశాలల మధ్య ఎంత అసమానంగా ఉన్నదో ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్రోల్మెంట్ తగ్గుతుండటంపై అధ్యయనం చేయాలని కేంద్రం ఆదేశించిన ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత నర్సింగ్ ఆఫీసర్ల యూనిఫామ్ డ్రెస్ కోడ్ను మార్చాలని తెలంగాణ నర్సుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.