న్యూఢిల్లీ, డిసెంబర్ 2: విశ్రాంత న్యాయమూర్తులపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ మధ్యవర్తిత్వ వ్యవస్థను రిటైర్డ్ జడ్జీలు బిగించిన పిడికిల మధ్య ఉంచారని విచారం వ్యక్తం చేశారు. ఇతర అర్హత కలిగిన వ్యక్తులకు అవకాశం నిరాకరించడంతో ఇది ఓల్డ్ బాయ్స్ క్లబ్‌లా ఉందని చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలా మధ్యవర్తిత్వ వ్యవస్థను విశ్రాంత న్యాయమూర్తులు గుప్పిట్లో పెట్టుకోవడం ప్రపంచంలోని ఏ దేశంలోనే లేదని, ఇది మనదేశంలోనే అధికమని అన్నారు. ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మధ్యవర్తిత్వ ప్రక్రియ న్యాయపరమైన అడ్డంకుల నుంచి ఇబ్బంది పడకుండా ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారత దేశంలోని మధ్యవర్తిత్వ వ్యవస్థపై దేశంలో న్యాయవ్యవస్థ రూపురేఖలను మార్చివేస్తున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధైర్యమైన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.