చెన్నై: కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. బహిరంగ ప్రదేశాలు, హోటళ్లు, బీచ్లలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు చెన్నై పోలీసులు ఆదేశాలు జారీచేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా మెరీనా బీచ్, ఎల్లియాట్స్ బీచ్, నీలంకారీ, ఈస్ట్ కోస్ట్ రోడ్లలో ప్రజలు గుమికూడటానికి అనుమతిలేదని అధికారులు వెల్లడించారు. ప్రతిఒక్కరు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సిందేననే స్పష్టం చేశారు.
చెన్నైలో నిన్న 23 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమనియన్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 45 మందికి ఒమిక్రాన్ వైరస్ సోకిందని చెప్పారు. బాధితులంతా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని వెల్లడించారు. మంగళవారం 619 కరోనా కేసులు నమోదయ్యాయి.