ముంబై, మే 29: ఈసీఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎడెల్వీజ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) లిమిటెడ్లపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బుధవారం వ్యాపారపరమైన ఆంక్షల్ని విధించింది. రుణాల మంజూరు, మొండి బకాయి (ఎన్పీఏ)ల కొనుగోలు, ఇతరత్రా అంశాల్లో లోపాలు, నిబంధనల ఉల్లంఘనలే ఇందుకు కారణం. ఇప్పటికే తీసుకున్న రుణాలను చెల్లించలేకపోతున్న రుణగ్రహీతలకు.. ఆ బకాయిలను తీర్చేందుకు కొత్తగా మళ్లీ రుణాలను మంజూరు చేస్తున్నారన్నదానిపై సెంట్రల్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. తద్వారా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఖాతా పుస్తకాల నుంచి తొలగిస్తున్నారని మండిపడింది. ఈ రకమైనవి నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)ను పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సూపర్వైజరీ చర్యలకు దిగింది. రీపేమెంట్లు, ఖాతాల మూసివేత మినహా కొత్త రుణాల మంజూరు తదితర మిగతా అన్ని రకాల లావాదేవీలను ఆపేయాలని ఈసీఎల్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే సెక్యూరిటీ రిసిప్ట్లు (ఎస్‌ఆర్‌లు)సహా ఒత్తిడిలో ఉన్న రుణాల కొనుగోలు వంటివన్నింటినీ నిలిపివేయాలని ఎడెల్వీజ్ ఏఆర్సీకి కూడా స్పష్టం చేసింది. తమ ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ఆర్బీఐ ఈ సందర్భంగా ప్రకటించింది.
వరుస ఘటనలు..
బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)ల్లో వరుసగా చోటుచేసుకుంటున్న నిబంధనల ఉల్లంఘనలు ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నాయిప్పుడు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇలా చెప్పుకుంటూపోతే.. ఆర్బీఐ నుంచి ఆంక్షలు ఎదుర్కొన్న సంస్థల జాబితా పెద్దగానే ఉన్నది మరి.