న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు(supreme court)లో వాదనలు జరిగాయి. ఆ రాష్ట్ర పరిస్థితిపై గురువారం పాజిటివ్ ప్రకటన చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. నిర్దేశిత సమయంలోగా ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాల నేపథ్యంలో కేంద్రం తరపున కోర్టులో సొలిసిటర్ జనరల్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే వీలు ఉంటుందా, ఓ రాష్ట్రం నుంచి యూటీని రూపొందించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని, ప్రజాస్వామ్యం స్థాపన ఎప్పుడు జరుగుతుందని కోర్టు కేంద్రాన్ని అడిగింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. కేంద్ర పాలిత ప్రాంతం అనేది పర్మినెంట్ కాదు అని, కానీ లడాఖ్ మాత్రం యూటీగానే ఉంటుందని తుషార్ మెహతా తెలిపారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే.