న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పలు క్యాటగిరీల ప్రయాణికులకు రైల్వే టికెట్లపై ఇస్తున్న రాయితీలను ప్రస్తుతానికి పునరుద్ధరించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సదుపాయాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతూ పలు వర్గాల నుంచి వచ్చిన అనేక అభ్యర్థనలపై పరిశీలన చేశామని, అయితే ప్రస్తుతానికి అది సాధ్యం కాదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాజ్యసభకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది కరోనా సంక్షోభం ప్రారంభానికి ముందు వరకు దివ్యాంగులు, వృద్ధులు, విద్యార్థులు వంటి 54 క్యాటగిరీల ప్రయాణికులకు రైల్వే శాఖ టికెట్ల ధరపై రాయితీ కల్పించేది.