న్యూఢిల్లీ: మహిళలు చీరలు ధరించడం భారతీయ సంప్రదాయం. అయితే చీరలో వచ్చిన ఒక మహిళను రెస్టారెంట్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఆమె వస్త్రధారణ స్మార్ట్ క్యాజువల్ డ్రెస్ కోడ్ కిందకు రాదంటూ రెస్టారెంట్లోకి రాకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో చీర ధరిస్తే రెస్టారెంట్‌లోనికి అనుమతించకూడదన్న డ్రెస్ కోడ్ గురించి తనకు చూపించాలని ఒక మహిళ అక్కడి సిబ్బందిని నిలదీసింది. అయితే ‘మేము స్మార్ట్ క్యాజువల్‌ని మాత్రమే అనుమతిస్తాము. చీర స్మార్ట్ క్యాజువల్ కిందకు రాదు’ అంటూ ఒక సిబ్బంది సమాధానమిచ్చాడు.
దేశ రాజధాని ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి మార్గంలోని అన్సల్ ప్లాజాలో ఉన్న అక్విలా బార్ అండ్ రెస్టారెంట్లో జరిగిన ఈ ఘటనపై జర్నలిస్ట్ అనితా చౌదరి ఆశ్చర్యపోయారు. దీనిపై ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘చీర ధరించే మహిళలను అక్విలా రెస్టారెంట్లోకి అనుమతించరు. ఎందుకంటే భారతీయ చీర ఇప్పుడు స్మార్ట్ డ్రెస్ కాదు. అసలు స్మార్ట్ డ్రెస్‌కు కాంక్రీట్ నిర్వచనం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి. దయచేసి స్మార్ట్ దుస్తుల గురించి నిర్వచించండి. అప్పుడు నేను చీర కట్టుకోవడం మానేస్తాను’ అని ఆమె అందులో పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ మహిళా కమిషన్‌తోపాటు పలువురికి దీనిని ట్యాగ్ చేశారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆ రెస్టారెంట్ డ్రెస్ కోడ్ విధానంపై మండిపట్టారు. ఇది వివక్షతతో కూడిన దారుణ నిబంధన అని ఆరోపించారు. ‘చీర స్మార్ట్ డ్రెస్ కాదని ఎవరు నిర్ణయించారు?’ అని ట్విట్టర్ యూజర్ షెఫాలి వైద్య ప్రశ్నించారు. అమెరికా, బ్రిటన్, యూఏఈలోని ఉత్తమ రెస్టారెంట్లలో కూడా తాను చీరలు ధరించినట్లు ఆమె చెప్పారు. అక్విలా రెస్టారెంట్ వంటివి భారత్‌లో డ్రెస్ కోడ్‌ను నిర్దేశిస్తాయా అని మండిపట్టారు.
తన తల్లి చీరలో ఆల్ప్స్ పర్వతంపైకి ఎక్కారని, అక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఒక యూజర్ తెలిపారు. చీరను ధరించిన మహిళను లోనికి అనుమతించని అక్విలా రెస్టారెంట్ ఇది చూసి సిగ్గుపడాలంటూ ఆల్ప్స్ పై చీరలో ఉన్న తన తల్లి ఫొటోను ఆమె షేర్ చేశారు. మరోవైపు ఈ రెస్టారెంట్ విధించిన ఈ నిబంధనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్విలా రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Saree is not allowed in Aquila restaurant as Indian Saree is now not an smart outfit.What is the concrete definition of Smart outfit plz tell me @AmitShah @HardeepSPuri @CPDelhi @NCWIndia
— anita choudhary (@anitachoudhary) September 20, 2021
Please define smart outfit so I will stop wearing saree @PMishra_Journo #lovesaree pic.twitter.com/c9nsXNJOAO