Tejashwi Yadav : త్వరలో చేపట్టబోయే జనాభా లెక్కలతోపాటే కులగణన (Caste Census) చేపడుతామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను రాష్ట్రీయ జనతా దళ్ (RJD) స్వాగతించింది. ఈ మేరకు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి లేఖ రాశారు. మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఇది ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని ఆ లేఖలో పేర్కొన్నారు. కులగణన కేవలం డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని తేజస్వియాదవ్ సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని, ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. కులగణన నిర్వహించిన అనంతరం ఆ డేటాను వ్యవస్థాగత సంస్కరణలు చేయడానికి ఉపయోగిస్తారా లేదా మునుపటి కమిషన్ల నివేదికల మాదిరిగానే ఉంచేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు. జనాభా లెక్కలు, కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బీహార్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎన్నో ఏళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న కులగణన డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోకుండా దేశ ప్రజల్లో విభజనలు సృష్టించడం సరైన చర్య కాదని తేజస్వి తన లేఖలో పేర్కొన్నారు. బీహార్ కుల సర్వే చేపట్టినప్పుడు కేంద్రం పదేపదే దానిని అడ్డుకుందని గుర్తుచేశారు. ఆలస్యంగా అయినా కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివల్ల సమాజంలో చాలాకాలంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. జనగణన డేటా సామాజిక రక్షణ, రిజర్వేషన్ విధానాల సమగ్ర సమీక్షకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు.
అదేవిధంగా రిజర్వేషన్లపై ఉన్న ఏకపక్ష పరిమితిని కూడా పునఃపరిశీలించాలని తేజస్వి కేంద్రాన్ని కోరారు. జనాభా లెక్కల్లోనే కులగణనను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో కులగణన నిర్వహించాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా లెక్కలు తీయాలనేదే మోదీ ప్రభుత్వ సంకల్పమన్నారు.