TRF | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులను తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సంస్థ ప్రకటించుకొన్నది. 2019, ఆగస్టులో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం అదే ఏడాది అక్టోబర్‌లో ఈ సంస్థ ఏర్పాటైంది. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్-ఏ-తాయిబాకు (ఎల్ఈటీ) చెందిన ఉగ్రవాద కమాండర్లు ఈ సంస్థను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఎల్ఈటీకి అనుబంధంగా టీఆర్ఎఫ్ ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. టీఆర్ఎఫ్ సంస్థకు ఉగ్రవాది షేక్ సజ్జద్ గుల్ సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తుండగా, మరో ఉగ్రవాది బాసిత్ అహ్మద్ దార్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా పని చేస్తున్నాడు.
మైండ్ గేమ్‌తో ముగ్గులోకి..
సోషల్‌మీడియా ద్వారా సైకలాజికల్ మైండ్ గేమ్ పోస్టులు, వీడియోలతో యువతను ప్రభావితం చేయడం టీఆర్ఎఫ్ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. అలా బ్రెయిన్ వాష్ అయిన యువతతో ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తూ.. ఉగ్ర దాడులకు స్కెచ్ వేయడం టీఆర్ఎఫ్ పని అంటూ భారత ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే 2023 జనవరిలో టీఆర్ఎఫ్ను నిషేధించింది.
గతంలో దాడులు ఇలా..
2024 అక్టోబర్‌లో గండేర్బాల్ జిల్లాలో, కుప్వారాలో 2020లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు.
దాడి గురించి ముందస్తు సమాచారం ఉన్నా..!
పహల్గాం ఉగ్రదాడి గురించి మన నిఘా సంస్థలకు ముందే సమాచారం ఉందా? అయినా వారు ఉదాసీనంగా వ్యవహరించారా? అంటే నిజమేనని సమాధానం వస్తున్నది. దక్షిణ కశ్మీర్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం ముందే అందింది. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలపై దాడులు చేయాలని, కశ్మీరేతరులపై వారి మతాన్ని గుర్తించి దాడి చేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఈ కాల్పులకు ముందు ఈ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ కూడా నిర్వహించారు. ముగ్గురు నుంచి 5 మంది మాత్రమే ఉన్న ఈ ఉగ్రవాదులు భద్రతా దళాల కళ్లుగప్పి తమ ఆయుధాలను ఇక్కడకు తీసుకురావడంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు. ఉగ్రదాడి గురించి తమకు ముందస్తు సమాచారం ఉన్నట్టు భద్రతా దళాలు దాడి అనంతరం వెల్లడించడం గమనార్హం. ముందే సమాచారం ఉన్నా అంత ఉదాసీనంగా ఎలా ఉన్నారు? పర్యాటకుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.