న్యూఢిల్లీ: పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల(Polymer Banknotes)ను ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. రోజు రోజుకూ కరెన్సీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ ప్లాన్ వేసింది. ఇటీవల పాట్నా, ముంబైలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో పాలిమర్ నోట్ల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు విస్తృతంగా చర్చించారు. పాలిమర్ నోట్లకు ఎక్కువ సెల్ఫ్ లైఫ్ ఉంటుందని, తయారీ కోసం తక్కువ ఖర్చు అవుందని భావిస్తున్నారు. సంప్రదాయకర కాగితం కరెన్సీ తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పేపర్ నోట్ల కన్నా.. పాలిమర్ నోట్ల తయారీకి తక్కువ ఖర్చు అవుతుంది. ఏటీఎంల ద్వారా కూడా ఈజీగా పాలిమర్ నోట్లను పంపిణీ చేయవచ్చు అన్న ఆలోచనలో ఆర్బీఐ ఉంది.
పాలిమర్ కరెన్సీ నోట్లకు చెందిన పైలట్ ప్రాజెక్టును ఆర్బీఐ త్వరలో ప్రకటించనున్నది. పేపర్ మనీ ప్రింటింగ్ కోసం అయ్యే ఖర్చు బాగా పెరిగిపోయిందని, 5101.4 కోట్ల నుంచి 6,372.8 కోట్లకు ఆ ఖర్చు చేరుకుందని ఇటీవల ఆర్బీఐ వార్షిక నివేదికలో పేర్కొన్నది. బ్యాంక్ నోట్ల ప్రింటింగ్ కోసం డిమాండ్ పెరగడం వల్ల ఖర్చు పెరిగినట్లు నివేదికలో తెలిపారు. ఇక పాడైన, పాతబడిపోయిన, చిరిగిన పేపర్ కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. 2025 వార్షిక సంవత్సరంలో సుమారు 23.8 బిలియన్ల చిరిగిన నోట్లను రద్దు చేశారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12.3 శాతం అధికం. 2024 వార్షిక సంవత్సరంలో సుమారు 21.24 బిలియన్ల చిరిగిన కరెన్సీ నోట్లను రద్దు చేసినట్లు తెలిసింది. 500, 100 నోట్లు ఎక్కువగా రద్దు చేయాల్సి వచ్చిందన్నారు.
1988లో తొలిసారి ఆస్ట్రేలియా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. 1996 నాటికి ఆ దేశం పూర్తి స్థాయిలో పాలిమర్ నోట్లను వినియోగంలోకి తెచ్చింది. ఇక కెనడా 2011లో పాలిమర్ కరెన్సీ నోట్లను తెచ్చింది. అయితే పేపర్ కన్నా పాలిమర్ బెటర్ అని కెనడా అనేక విశ్లేషణలు చేసింది.