Ground Water | న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల వల్ల భూగోళంపై పడుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న పరిశోధకులు దిగ్భ్రాంతికరమైన ఓ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. భూగర్భ జలాలను మానవాళి అమితంగా తోడేయడం వల్ల భూభ్రమణ అక్షం 31.5 అంగుళాల (దాదాపు 80 సెంటీమీటర్ల) మేరకు వంగిపోయిందని, ఇది భూభ్రమణంలో మార్పునకు, సముద్ర మట్టాల పెరుగుదలకు దారితీసిందని వెల్లడించారు.
ఈ అధ్యయన వివరాలు జర్నల్ జియోఫిజికల్ రిసెర్చ్ లెటర్స్లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం భూగోళ అక్షంలో వచ్చిన మార్పు సముద్ర మట్టం 0.24 అంగుళాల మేర పెరిగినంతకు సమానమని ‘పాపులర్ మెకానిక్స్’ స్పష్టం చేసింది. భూభ్రమణ అక్షంలో చాలా మార్పు వచ్చిందని, భూగర్భ జలాలను అడ్డగోలుగా తోడేయడమే ఇందుకు కారణమని తమ పరిశోధనలో తేలిందని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కి-వియాన్ సియో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.