న్యూఢిల్లీ : జపాన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన ఒసాకా, తోయామా, హిరోషిమా, కగోషిమా పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన పరిశోధన డిప్రెషన్ (కుంగుబాటు) చికిత్సలో కొత్త ఆశను రేకెత్తిస్తున్నది. ప్రస్తుతం డిప్రెషన్‌కు (Depression) అందుబాటులో ఉన్న మందులు ప్రభావం చూపడానికి కొన్ని వారాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో పరిశోధకులు పీఏ-915 అనే కొత్త నాన్-పప్టైడ్ అణువును అభివృద్ధి చేశారు. ఇది పీఏసీ1 రిసెప్టార్ అనే నిర్దిష్ట గ్రాహకానికి బలంగా అడ్డుకట్ట వేస్తుంది. డిప్రెషన్‌తో ఉన్న జంతు నమూనాలపై ఈ ఔషధాన్ని ఒక్కసారి (సింగిల్ డోస్) ఇవ్వగా ఆందోళన, కుంగుబాటు లక్షణాలు, జ్ఞాపకశక్తి లోపాలు వేగంగా మెరుగుపడ్డాయి.
ముఖ్యంగా ఒక్కడోస్ పీఏ-915 ఇచ్చిన ఎలుకల్లో డిప్రెషన్ లక్షణాల్లో 8 వారాలపాటు మెరుగుదల కనిపించడాన్ని గుర్తించారు. ఈ ఔషధం మెదడులోని మీడియల్ ప్రీప్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో దెబ్బతిన్న డెండ్రిటిక్ స్పైస్ సాంద్రతను పెంచింది. అంటే న్యూరాన్ల (నాడీ కణాలు) పనితీరు మెరుగుపడినట్టు ఇది సూచించింది. సాధారణ ఎలుకలపై (డిప్రెషన్ లేనివి) పీఏ-915 ఎటువంటి ప్రవర్తనా లోపాలను చూపించలేదు. యాంటీడిప్రెసెంట్ మందుల కంటే భిన్నమైన విధానాన్ని ఇది సూచిస్తుంది.