GPS | న్యూఢిల్లీ : మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. వెంటనే స్మార్ట్‌ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్‌లో సదరు చిరునామా ఎంటర్ చేయగానే అక్కడికి ఎలా వెళ్లాలి? ఆ ప్రదేశం ఎంతదూరం ఉన్నది? వెళ్లటానికి ఎంత సమయం పడుతుంది? అనే వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. దీనికి మూలం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).
ఈ టెక్నాలజీని ఒక్కో దేశం ఒక్కో పేరుతో పిలుస్తున్నప్పటికీ అందరికీ తెలిసిన పేరు మాత్రం జీపీఎస్. ఇది మనిషి సృష్టించిన సాంకేతికత. కానీ, వేల ఏండ్ల నుంచి భూమిపై నివసిస్తున్న కొన్ని జీవుల్లో ఈ టెక్నాలజీ సహజంగానే నిక్షిప్తమై ఉన్నదని తాజాగా తేలింది. ముఖ్యంగా వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించే వలస పక్షుల మెదళ్లలో జీపీఎస్‌లాంటి వ్యవస్థ సహజంగానే ఉన్నదని కెనడాలోని వెస్టర్న్ ఒంటారియో యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. భూమి ఒక పెద్ద అయస్కాంతమని పాఠశాల స్థాయిలోనే అందరూ చదువుకొని ఉంటారు.
ఈ అయస్కాంత క్షేత్రమే సౌర గాలులు, ఇతర ప్రమాదకర కిరణాల నుంచి భూమిపై సకల జీవకోటికి రక్షణ ఇస్తున్నది. పక్షుల మెదళ్లలోని జీపీఎస్‌కు కూడా ఈ అయస్కాంత క్షేత్రమే కారణమని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు.. మన ఫోన్లలో జీపీఎస్‌ను అవసరాన్ని బట్టి ఆన్.. ఆఫ్ చేసుకొన్నట్టే పక్షులు కూడా క్షణాల్లో ఆన్.. ఆఫ్ చేసుకొంటున్నాయని యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మెడలీనా బ్రాడ్బెక్ తెలిపారు. పక్షుల మెదళ్లలోనే సహజంగా ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిందని తాజాగా గుర్తించారు.