Uttarkashi Tunnel Mishap | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకురావడంలో ప్రభుత్వ చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో వివిధ రాష్ర్టాల్లో ఇలాంటి ప్రమాదాలే జరిగినప్పుడు అక్కడి ప్రభుత్వాలు కార్మికులను కాపాడి బయటకు తీసుకొచ్చిన ఘటనలు ఉదాహరణలుగా కనిపిస్తున్నప్పటికీ ఎస్ఎల్బీసీ సొరంగంలోని వారిని ఇంకా బయటకు తీసుకురాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదాన్ని ఉదహరిస్తున్నారు. అసలేమిటీ ప్రమాదం? ఇప్పుడు దానిపై చర్చ ఎందుకు జరుగుతున్నది?
ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి మధ్య రోడ్ అనుసంధానం పెం చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చార్ధామ్’ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా, దండల్‌గావ్‌ను కలిపేమార్గంలో 4.5 కిలోమీటర్లు సొరంగం నిర్మించారు. 2023 నవంబర్ 12న సొరంగం పనులు చేసేందుకు 41 మంది కార్మికులు ఉదయాన్నే లోపలికి వెళ్లారు. ప్రమాదవశాత్తు సొరంగంలోని పైకప్పు కూలిపోయింది. దీంతో 260 మీటర్ల మార్క్‌కు అవతల కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ జింద గీ’ పేరిట కార్మికులను కాపాడే పనులు ప్రాంభించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో పాటు విదేశీ నిపుణులు రంగంలోకి దిగారు. అత్యాధునిక ఆగర్లు, మిషన్లను సమకూర్చుకున్నారు. సొరంగానికి ఒకపక్క పనిపూర్తికాకపోవడం, రెండోవైపు నుంచి రావాలంటే దాదాపు 60 మీటర్ల పొడువునా శిథిలాలు అడ్డుగా ఉండటంతో రక్షణ పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్లాన్-బీని ముందుకు తీసుకొచ్చారు. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపుమార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టారు. అయితే, తవ్వకం జరుగుతుండగా 25 టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముక్కలైంది. ఆ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడినట్టు పెద్ద శబ్దం రావడం మొదలైంది. దీంతో ఆ పనిని మధ్యలోనే నిలిపేశారు.
అప్పటికే కార్మికులు సొరంగంలో చిక్కుకొని 15 రోజులు గడుస్తున్నది. కార్మికులను బయటకు తీసుకొస్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. బాధితుల కోసం వారి కుటుంబసభ్యులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. 2018లో ధాయిలాండ్లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న విద్యార్థులను కాపాడిన రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో అధికారులు మాట్లాడారు. వాళ్లిచ్చిన సలహాలతో ‘ర్యాట్‌హోల్ మైనింగ్ టెక్నిక్’ను తెరమీదకు తీసుకొచ్చారు.
ర్యాట్‌హోల్ టెక్నిక్‌లో ఒకే ఒక్క మనిషి పట్టేంత వెడల్పుతో సొరంగాన్ని తవ్వుతారు. సులభమైన పనిముట్లతో ఒకరు మట్టిని తవ్వుతుంటే, వెనుక ఉన్న వ్యక్తి ఆ మట్టిని బయటకు పంపిస్తారు. అలా పైకప్పు కూలకుండా చిన్నచిన్నగా సొరంగాన్ని తవ్వుతూ లోపలికి వెళ్తారు. ఆ ర్యాట్‌హోల్ మైనింగ్ టెక్నిక్‌ను కార్మికులను కాపాడటానికి వాడాలనుకొని అధికారులు నిర్ణయించుకొన్నారు.
16వ రోజు ఉదయం ‘ర్యాట్‌హోల్ మైనింగ్’లో నైపుణ్యం కలిగిన కొందరు కార్మికులు రంగంలోకి దిగారు. చిన్నచిన్న పనిముట్ల సాయంతో మట్టిని తవ్వుతూ 24 గంటల్లోనే 10 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. అలా కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతానికి కేవలం 2 మీటర్ల దూరం వరకు వెళ్లారు. ‘ర్యాట్‌హోల్ మైనింగ్’ కార్మికులు తవ్విన మార్గం గూండా పైపులను పంపి ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు 17వరోజు రాత్రికి 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కార్మికులను కాపాడిన యంత్రాగానికి ప్రపంచ దేశాధినేతలు అభినందనలు తెలిపారు.
కార్మికులు సొరంగంలో ఏ ప్రాంతంలో చిక్కుకుపోయారో సాంకేతికత ద్వారా గుర్తించిన అధికారులు అక్కడికి ప్రత్యేక పైపుల ద్వారా లోపలికి నీళ్లు, ఆక్సిజన్, ఆహారాన్ని పంపించడం ప్రారంభించారు. ఘటన జరిగిన తొలిరోజు నుంచే ఇలా చేయడంతో కార్మికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు.