Republic Day Parade | న్యూఢిల్లీ, జనవరి 26: దేశ, విదేశాల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో వికసిత్ భారత్ ఇతివృత్తంగా జరిగిన వేడుకలు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని చాటి చెప్పాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియా ంతో ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత జాతీయజెండాను ఆవి ష్కరించి పరేడ్‌లో పాల్గొన్న త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
వివిధ ప్రాంతాలకు చెందిన 5 వేల మంది జానపద కళాకారులు తొలిసారిగా వివిధ రాష్ర్టాల సంస్కృతులను ప్రతిబింబించే 45 రకాల నృత్యరీతులను ప్రదర్శించారు. సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ‘జయతే జయ మహా భారతం’ పేరిట ప్రదర్శించిన 11 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శకటం ఏటికొప్పాక చెక్క బొమ్మల తయారీని వివరించింది. యూపీ శకటం మహా కుంభ మేళా జరిగే విధానాన్ని ఆవిష్కరించింది. మొత్తం 31 శకటాలు మనగొప్పదనాన్ని చాటిచెప్పాయి.
మన రక్షణ వ్యవస్థ పాటవాన్ని చాటే బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ వంటి అత్యాధునిక క్షిపణులు, రాకెట్లను భారత సైన్యం ప్రదర్శించింది. భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని ప్రదర్శించాయి.‘సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ థీమ్‌తో దీనిని తయారు చేశారు.
చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలతో పరేడ్ నిర్వహించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు పాల్గొన్నారు. డీఆర్డీవో నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. సీఆర్పీఎఫ్కు చెందిన 148 మంది మహిళలు, ఆర్పీఎఫ్ బృందం పరేడ్లొ పాల్గొన్నాయి. ైరాష్ట్రపతి ముర్ముకు వందనం సమర్పించిన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ డింపిల్ సింగ్ భాటి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.