న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కనందుకు ఆ పార్టీ కీలక నాయకుడు అజిత్ పవార్ (Ajit Powar) అసంతృప్తిగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్సీపీ కొట్టిపారేసింది. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కుమార్తె, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే (Supriya Sule) ఒక ప్రకటన చేశారు.
‘అజిత్ పవార్ సంతోషంగా లేరని ఎవరన్నారు..? హ్యాప్పీగా ఉన్నారా.. లేరా..? మీరెవరైనా ఆయనను అడిగారా..?’ అని సుప్రియా సూలే ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కనందుకు ఆయన అసంతృప్తిగా ఉన్నరంటూ జరుగుతున్నది ఒట్టి ప్రచారమేనని ఆమె కొట్టిపారేశారు. పార్టీ కార్యకర్తలు అలాంటి పుకార్లను నమ్మవద్దని చెప్పారు.
కాగా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ గత శనివారం ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించారు. వారిలో ఒకరు ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కాగా, మరొకరు రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్. అయితే, పార్టీలో సెకండ్ లీడర్‌గా కొనసాగుతున్న అజిత్‌పవార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కక పోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.