Yediyurappa | బెంగళూరు: కొవిడ్-19 సమయంలో పీపీఈ కిట్లు, మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పపై వచ్చిన ఆరోపణలను రిటైర్డ్ హైకోర్డు జడ్జి మైఖేల్ డీచున్హా కమిషన్ నిర్ధారించింది. యెడియూరప్ప, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములుపై అవినీతి నిరోధక శాఖ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ కొనుగోలు వ్యవహారంలో రూ.150 కోట్ల గోల్మాల్ జరిగింది.
తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్‌ను నియమించింది. దీనిపై యెడియూరప్ప స్పందిస్తూ ఇవన్నీ కాంగ్రెస్ రాజకీయ ఉద్దేశంతో చేపట్టిన కక్ష సాధింపు చర్యలని అన్నారు. దర్యాప్తులో నిజం బయటపడుతుందని అన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆరోగ్య శాఖ మంత్రి గుండూరావు స్పందిస్తూ కొవిడ్‌తో ఒక పక్క ప్రజలు చనిపోతున్నా, దానిని అక్రమార్జనకు అప్పటి బీజేపీ ప్రభుత్వం వినియోగించుకుందని విమర్శించారు. దీనిపై విచారణ ప్రారంభిస్తామని, తక్షణం కొన్ని చర్యలు చేపడతామని చెప్పారు.
అధిక ధరలకు కొనుగోలు
2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో యెడియూరప్ప ప్రభుత్వం పెద్దయెత్తున పీపీఈ కిట్లు, మందులు కొనుగోలు చేసింది. వీటిలో చాలా కంపెనీలు చైనాకు చెందినవి కాగా, నిర్దేశించిన మొత్తం కన్నా అధిక ధరతో వీటిని కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.