Renuka Chaudhary : ప్రతి జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌధరి ఆగ్రహం వ్యక్తంచేశారు. వరుసగా పిల్లలు కనడానికి మహిళలేమైనా కుందేళ్లా..? అని ఆమె ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఖాళీగా ఉన్న వారికి బిడ్డలను ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఆమె వ్యాఖ్యానించారు.
‘దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. పిల్లలను కన్నంత మాత్రాన ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. ఉద్యోగం లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడరు. ఆయన ఎక్కువమంది పిల్లలను కనాలని చెబుతున్నాడు. వరుసగా పిల్లలను కనడానికి మహిళలు ఏమైనా కుందేళ్లా..? ఈ మాటలు చెప్పేవాళ్లు ఎంతమంది పిల్లలను పెంచగలరు..? వారి అనుభవాలు ఏమిటో బాగా తెలుసు’ అని రేణుకా చౌధరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ధరలు, కల్తీలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆమె ఆరోపించారు. కాగా ఇటీవల నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేణుకా చౌధరి మాట్లాడారు. దేశంలో జనాభా క్షీణత కొనసాగుతోందని, ఈ క్షీణత ఇలాగే కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేణుకా చౌధరి పైవిధంగా స్పందించారు.