Punjab Murders : పంజాబ్ రాష్ట్రం (Punjab state) లో ‘రిమోట్ కంట్రోల్ హత్యలు (Remote Control Murders)’ భద్రతా వర్గాలకు పెను సవాల్‌గా మారాయి. విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లు, స్థానిక ముఠాల ద్వారా హత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత లక్కీ ఒబెరాయ్ (Lucky Oberoy) హత్య వెనుక కూడా విదేశీ గ్యాంగ్స్టర్ల నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు (Punjab police) గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపారు.
కాగా గత కొన్నేళ్లుగా పంజాబ్‌లో గ్యాంగ్స్టర్ల ముఠాలు పేట్రేగిపోతున్నాయి. విదేశాల్లో ఉంటున్న ప్రధాన నేరగాళ్లు, స్థానికంగా యువకులను నియమించుకుని రాజకీయ హత్యలు, బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఈ గ్యాంగ్స్టర్ల నెట్‌వర్క్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంది. ఖలిస్థాన్ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు వీరిని వాడుకుంటోంది. దావూద్ ఇబ్రహీంతో గతంలో కుదుర్చుకున్న తరహాలోనే ఈ ముఠాలతోనూ ఐఎస్ఐ ఒప్పందం చేసుకుంది.
డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బులో 40 శాతం వాటాను తీసుకుని, ఆ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. ఈ ముఠాలను అణచివేసేందుకు పంజాబ్ పోలీసులు ‘ఆపరేషన్ ప్రేయర్-2’ చేపట్టారు. ‘గ్యాంగ్స్టర్లపై వేటు’ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 10 వేల మంది పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాంగ్స్టర్ల ఇళ్లు, రహస్య స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసి 1,100 మందిని అరెస్ట్ చేశారు.
మొదటి దశ ఆపరేషన్‌లో ఇప్పటికే 3,256 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని స్పష్టంచేశారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య రాష్ట్రంలో ఆరు టార్గెటెడ్ హత్యలు జరగడంతో వ్యాపార వర్గాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాగా, ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, అమెరికా, కెనడా అధికారుల సాయంతో విదేశాల్లోని సూత్రధారులను పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోందని భారత అధికారులు తెలిపారు.