న్యూఢిల్లీ, ఆగస్టు 21 : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత జనం తమ పక్కనున్న వారితోకంటే కంప్యూటర్ లేదా సెల్‌ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. టిక్‌టాక్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్నచిన్న వీడియోలు (రీల్స్) షూట్ చేసి జనాలపైకి వదలడం ప్రారంభమైంది. చైనాకు చెందిన ఆ యాప్‌ను భారత్‌లో నిషేధించిన అనంతరం ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో ఈ రీల్స్ ప్రతిరోజు వేలు, లక్షల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తుండగా ఎక్కువ సంఖ్యలో అశ్లీలం, హింసను ప్రేరేపించేవిగానే ఉంటున్నాయి. అవి ఏ రకమైనవి అయినా వాటిని చూడటం ఇప్పుడు నెటిజనులకు ఓ వ్యసనంగా మారిపోయింది. ఆ వ్యసనం మద్యం వల్ల కలిగే అంతటి దుష్ప్రభావానికి దారి తీస్తున్నదని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రీల్స్ చూడటం వల్ల కేవలం సమయం మాత్రమే హరించుకుపోవడం లేదని, మెదడుపై అది తీవ్ర దుష్ప్రభావాన్ని కలుగజేస్తున్నదని న్యూరోసైంటిస్ట్లు హెచ్చరిస్తున్నారు. మెదడుపై ఆల్కహాల్ (మద్యం) వల్ల కలిగే దుష్ప్రభావం వంటిదే ఈ లఘు వీడియోల వల్ల కూడా కలుగుతుందని పేర్కొంటున్నారు. ఈ వీడియోలకు వ్యసనపరులుగా మారటం వల్ల మనిషిలో ప్రేరణ, కేంద్రీకరణ, జ్ఞాపకశక్తిపై కూడా దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని భారత్‌లోని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
దీనిపై తియాంజిన్ నార్మల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కియాంగ్ వాంగ్ నేతృత్వంలో జరిగిన ఓ అధ్యయన నివేదికను ఇటీవల న్యూరాల్మేజ్ పత్రికలో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం.. మద్యం సేవించినప్పుడు లేదా జూదం ఆడినప్పుడు మెదడులోని ఏ సర్క్యూట్లైతే ప్రేరేపితమవుతాయో, షార్ట్ వీడియోలు చూసినప్పుడు కూడా అదే ప్రభావం ఉంటుందని తెలిపింది. ‘రీల్స్‌కు వ్యసనపరులుగా మారటం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. చైనీయులు ప్రతిరోజు సగటున 151 నిమిషాలపాటు రీల్స్ చూస్తున్నారు. ఈ రీల్స్ వల్ల శ్రద్ధ లోపిస్తున్నది, నిద్రకు భంగం వాటిల్లుతున్నది, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నది’ అని వాంగ్ వివరించారు. ఈ రీల్స్ వల్ల ఏకాగ్రత, నైపుణ్యత, జ్ఞాపకశక్తి దెబ్బతింటున్నదని మరికొన్ని పరిశోధనలు వెల్లడించాయి.
పరిమితి లేకుండా రీల్స్ చూడటం వల్ల అంతిమంగా మెదడు దెబ్బతింటుందని, అందువల్ల పరిమితి విధించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఆ పరిమితి ఎంత అనేది నిర్దిష్టంగా చెప్పలేమని డాక్టర్ బహ్రానీ అన్నారు. స్క్రీన్ టైం అది కంప్యూటర్ అయినా, సెల్‌ఫోన్ అయినా రోజుకు రెండు లేదా మూడు గంటలు మించకూడదని చెప్పారు. అంతకుమించితే అది మెదడుకు విషంగా మారుతుందని హెచ్చరించారు. నేడు జనం క్రమంగా డిజిటల్ మత్తులోకి వెళ్తున్నారని, దానిని అరికట్టకపోతే, ఇది డిజిటల్ వెర్రి/పిచ్చి స్థితికి చేరుతుందని, ఇది నిద్రలేమికి, జ్ఞాపకశక్తి లోపానికి కారణమవుతుందని వివరించారు. రీల్స్ మొదట్లో వినోదాత్మకంగానే ఉంటాయని, కానీ అవి మన మెదడు పనితీరును మార్చేస్తాయని చెప్పారు.