న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట(Red Fort) సమీపంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు కారు పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుడు ధాటికి 13 మంది మృతిచెందగా, 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో ఎర్రకోటను బంద్ చేశారు. రాబోయే మూడు రోజుల పాటు విజిటర్స్‌కు ఎర్రకోట బంద్ ఉంటుందని అధికారులు చెప్పారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీనిపై ప్రకటన చేసింది. కారు బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అయితే ప్రజలు భారీ స్థాయిలో గుమ్మికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎర్రకోటను బంద్ చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రకటించింది.
కారు పేలుడుకు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు లింకు ఉన్నట్లు ప్రాథమిక విచారణ ద్వారా వెల్లడవుతున్నది. పేలడు కోసం డిటోనేటర్లు వాడినట్లు అనుమానిస్తున్నారు. అమోనియం నైట్రేట్ రసాయనం వాడి ఉంటారని భావిస్తున్నారు. సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ పేలుడుకు ముందు తన కారును ఎర్రకోట పార్కింగ్ ఏరియాలో సుమారు మూడు గంటల పాటు పార్కింగ్ చేశాడు. పేలుడు విచారణ చేపడుతున్న పోలీసులు.. పుల్వామాలో ఉన్న డాక్టర్ ఉమర్ ఫ్యామిలీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో లింకున్న నలుగుర్ని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. రెడ్‌ఫోర్ట్ మెట్రో స్టేషన్‌ను ఇవాళ మూసివేశారు.