న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ నెల 10న జరిగిన భారీ పేలుడు (Delhi Bomb Blast) ఘటనలో మరిన్ని విషయాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో పేలుళ్ల కోసం ఉగ్రవాదులైన డాక్టర్లు రూ.26 లక్షలకు పైగా విరాళాలను సేకరించారు. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో నిందితులు డాక్టర్ ముజమిల్ గనాయి, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షహీన్ సయీద్, డాక్టర్ ఉమర్ నబీ ఈ సొమ్మును నగదు రూపంలో సేకరించారు. ఈ సొమ్మును భద్రపరచాలని చెప్పి డాక్టర్ ఉమర్‌కు ఇచ్చారు. ఈ సొమ్ములో రూ.3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్పీకే ఫెర్టిలైజర్‌ను గురుగ్రామ్, నూహ్, ఇతర పట్టణాల్లో కొన్నారు. దీనిని ఇతర పదార్థాలతో కలిపి బాంబులను తయారు చేస్తారు.
ఎర్ర కోట వద్ద పేలుడు కేసులో దర్యాప్తు అధికారుల దృష్టి అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఉన్న 17వ భవనంలోని 13వ గదిపై పడింది. టెర్రర్ డాక్టర్లు ఇక్కడి నుంచే కుట్రకు పథక రచన చేసినట్లు అనుమానిస్తున్నారు. డాక్టర్ ముజమిల్ అహ్మద్ గనాయి ఈ గదిలోనే ఉండేవాడు. ఇక్కడి నుంచి కుట్రకు పథక రచన, సమన్వయం జరిగినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. డాక్టర్ ముజమిల్, డాక్టర్ షాహిన్ కలిసి అమ్మోనియం నైట్రేట్ రవాణా మార్గాలను నిర్ణయించారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఎర్ర కోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడుకు కారణమైన ఐ20 కారును నడిపింది టెర్రర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని డీఎన్ఏ పరీక్షల్లో వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అతని తల్లి, సోదరుల డీఎన్ఏతో అతని డీఎన్ఏ నూటికి నూరు శాతం సరిపోయిందని పేర్కొన్నాయి. 13కు చేరిన మృతుల సంఖ్య ఈ పేలుడులో గాయపడి, ఎల్ఎన్జేపీ దవాఖానలో చికిత్స పొందుతున్న బిలాల్ మరణించినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. దీంతో ఈ దారుణ సంఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది.
ఎర్ర కోట వద్ద జరిగిన పేలుడు సంఘటన కచ్చితంగా ఉగ్రవాద దాడేనని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో అన్నారు. ఈ పేలుడు ఘటనపై భారత దేశానికి ఆయన సంఘీభావం ప్రకటించారు. దర్యాప్తు అధికారుల పని తీరును ప్రశంసించారు.ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలో భారత దేశానికి అమెరికా మద్దతిస్తుందన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టెర్రర్ డాక్టర్ షహీన్ షాహిద్‌కు పాకిస్థాన్‌లోని అఫిరా బీబీతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు సోదరి అఫిరా బీబీ. ఆమె భర్త ఉమర్ ఫారూఖ్ జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో 2019లో సైనిక వాహనంపై ఉగ్ర దాడికి సూత్రధారి. అతనిని అదే సంవత్సరం ఎన్కౌంటర్లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా మహిళా బ్రిగేడ్ జమాత్-ఉల్-మొమినాత్ను ఇటీవలే ప్రారంభించారు. దీనికి అఫిరా బీబీ నాయకత్వం వహిస్తున్నది. కొద్ది వారాల క్రితమే ఈ మహిళా బ్రిగేడ్‌లోని సలహా మండలిలో టెర్రర్ డాక్టర్ షహీన్ షాహిద్ చేరింది. మసూద్ అజహర్‌కు మరో సోదరి సాదియా అజహర్, అఫిరా బీబీలతో టెర్రర్ డాక్టర్ షహీన్ సంబంధాలను కొనసాగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జమాత్-ఉల్-మొమినాత్ భారత దేశ విభాగానికి ఆమె నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం మహిళలను చేర్చుకునే బాధ్యతను ఆమెకు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు షహీన్ షాహిద్‌కు చెందిన మారుతి సుజుకి బ్రెజ్జా కారును ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కారు రిజిస్ట్రేషన్ ఆమె పేరు మీద జరిగిందన్నారు.
టెర్రర్ డాక్టర్ షహీన్ షాహిద్ ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల తర్వాత ఏం చేస్తారో అంతుబట్టటం లేదు. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో షిఫ్ట్ ముగిసిన తర్వాత ఆమె చేసే పని గురించి ఎవరితోనూ చెప్పేవారు కాదు. ఆమె వద్ద ఎప్పుడూ మతపరమైన పుస్తకాలు ఉండేవని తెలిసింది.
ఎర్ర కోట వద్ద సోమవారం జరిగిన పేలుడు కేసులో అనుమానితులైన జమ్ము కశ్మీర్‌కు చెందిన మెడికల్ ప్రొఫెసర్, కార్డియాలజీ స్టూడెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఉన్న జీఎస్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఫారూఖ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ డీఎం స్టూడెంట్ మహమ్మద్ ఆరిఫ్ మిర్‌ను గురువారం గుర్తు తెలియని ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్కాడ్ అరెస్ట్ చేసింది.