(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అటు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాలో లేక సొంత పార్టీ రెబల్స్‌ను బుజ్జగించాలో తెలియక ప్రధాన పార్టీలు సతమతమవుతున్నాయి. రాజస్థాన్‌లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల్లో రెబల్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీలకు దిక్కు తోచని పరిస్థితులు ఏర్పడ్డాయి.
రెబల్‌గా పోటీ చేస్తున్న వారిలో కాంగ్రెస్ పార్టీలో 11 మంది, బీజేపీలో 20 మంది ప్రముఖులున్నారు. వీరంతా అధిష్ఠానం తీరుపై మండిపడుతుండగా, మరికొందరు తమకు అన్యాయం జరిగిందంటూ పార్టీని వీడుతున్నారు. ఇలాంటి వారు అటు అధికార కాంగ్రెస్‌లోనే కాదు, ప్రతి పక్ష పార్టీలోనూ కనిపిస్తున్నారు. ఏది ఏమైనా రెబల్స్‌ను బుజ్జగించాలన్న రెండు ప్రధాన పార్టీల ప్రయత్నాలు ఫలించకపోవటంతో ప్రత్యర్థి పార్టీల అసంతృప్తులకు గాలం వేయడంలో రెండు పార్టీలు బిజీగా ఉన్నాయి.