స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): త్వరలో ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ఎన్నికలు కమలనాథులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు గుజరాత్ స్వరాష్ట్రం కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హిమాచల్ సొంత రాష్ట్రం కావడమే ఇందుకు కారణం. ఈ అసెంబ్లీ ఫలితాలు 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్‌లో ఈ నెల 12న పోలింగ్ జరుగనుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వరుసగా రెండోసారి ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్ బీజేపీని కలవరపెడుతున్నది. అలాగే బీజేపీ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. నడ్డా సొంత జిల్లా బిసాల్‌పూర్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కగా, ఒక స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ సారి ఇది తారుమారు కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నడ్డాకు సన్నిహితులైన సుభాష్ శర్మతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ ఠాకూర్ ఇద్దరికీ ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో సుభాష్ శర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇది పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
యాపిల్ పండ్ల ప్యాకేజీ డబ్బాలపై జీఎస్టీ విధించడం రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. జీఎస్టీ విధింపుపై అన్నదాతలు తీవ్ర నిరసన చేపడుతున్నారు. ఇది బీజేపీని కలవరపరుస్తున్నది. డబుల్ ఇంజిన్, ఉమ్మడి పౌరస్మృతి అంశాలను ఆ పార్టీ ప్రధాన ప్రచారాస్ర్తాలుగా చేసుకున్నప్పటికీ.. అవి ప్రజలను అంతగా ప్రభావితం చేయడం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరింది. జాతీయ సగటు నిరుద్యోగం 7.8 శాతం కాగా, హిమాచల్‌లో ఇది 9.2 శాతంగా నమోదు అయింది.
గుజరాత్లో 27 ఏండ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగడమే ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద గుదిబండగా మారినట్టు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ పాలనపట్ల విసిగిపోయిన ప్రజలు ఈ సారి మార్పు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యతిరేకత నుంచి బయటపడటానికి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. తాజాగా మోర్బీలో తీగల వంతెన ఘటనతో ప్రభుత్వం పరువంతా పోయిందని చెబుతున్నారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆప్ దూసుకుపోతున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు, ఉపముఖ్యమంత్రి సిసోడియా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. జోరుగా హామీలు కురిపించారు. ఆప్ రాకతో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నాయి.
గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో 54 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 30 సీట్లను గెలుచుకుంది. 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 35 సీట్లు గెలుచుకోగా, గత ఎన్నికల్లో 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే దక్షిణ గుజరాత్లో 2012 ఎన్నికల్లో 35 సీట్లకు గాను బీజేపీ 28 సీట్లు గెలుచుకోగా, 2017 ఎన్నికల్లో 25 సీట్లకు పరిమితం అయింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ఆరు సీట్ల నుంచి 10 సీట్లకు పెంచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ పట్ల పాటిదార్ల అసంతృప్తి కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోగలిగింది. ఈ సారి పాటిదార్లు ఉద్యమం లేకపోయినా, సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడం వల్ల సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పెట్రో ధరల పెంపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత, విద్యుత్తు కోతల పట్ల రైతుల ఆందోళనలు.. తాజాగా మోర్బీ ఘటన బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.