కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ తన మనసు మార్చుకున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని శిబిరానికి తాను తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇకపై ఆమె నాయకత్వంలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. (Rebel Trinamool MLA ghar wapsi) ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అమ్దంగా నియోజకవర్గానికి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ కూడా ప్రతిపక్ష నాయకుడు రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని అసమ్మతి వర్గంలో చేరారు. అయితే తిరుగుబాటు జరిగిన కొన్ని నెలల తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని శిబిరానికి తిరిగి వస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు.
కాగా, అసమ్మతి వర్గం తనను తప్పుదారి పట్టించిందని ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ ఆరోపించారు. ఆ వర్గం కూడా మమతా బెనర్జీ నేతృత్వంలోనే పనిచేస్తుందని తనకు చెప్పి ఆ పత్రంపై సంతకం తీసుకున్నారని తెలిపారు. ‘దీదీ మాకు సర్వస్వం. ఆమె మాకు టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపారు. ఆమె ఫోటోతోనే మేం ఓట్లు అడిగాం. ప్రజలు ఆమెను చూసే మాకు ఓటు వేశారు. మేం దీదీతోనే ఉన్నాం. ఇక్కడ ఉన్నంత కాలం ఆమెతోనే ఉంటాం’ అని ఆయన అన్నారు.
మరోవైపు హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ఫుర్ఫురా షరీఫ్ దర్గాకు చెందిన ‘పీర్జాదా’గా పిలిచే సిద్ధిఖీకి ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాలలో గణనీయమైన ప్రభావం ఉన్నది. ఆయన గత ఏడాది టీఎంసీలో చేరారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. టీఎంసీ ఆయనను అమ్దంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించగా ఘన విజయం విజయం సాధించారు.
అయితే బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు సంబంధించి టీఎంసీలో రాజకీయ పోరు నెలకొన్నది. ఈ అంశంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని అసమ్మతి వర్గం సవాల్ చేయడంతో పాటు బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యే కాసిమ్ సిద్ధిఖీ తిరిగి మమతా బెనర్జీ వర్గంలో చేరినట్లు తెలుస్తున్నది.