Kakoli Ghosh : తృణమూల్ కాంగ్రెస్ (TMC) రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ (Kakoli Ghosh) కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ .. బెంగాల్ మాజీ సీఎం మమతాబెనర్జీ (Mamata Banerjee) కి లీగల్ నోటీసులు పంపారు. టీఎంసీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee), సౌగతా రాయ్ (Saugata Roy), మహువా మొయిత్రా (Mahua Moitra) లకు కూడా నోటీసులు పంపించారు. బరసత్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి తాను పార్టీ టికెట్ కోరానని టీఎంసీ నేతలు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఈ నెల మొదట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతాబెనర్జీ మాట్లాడుతూ.. బరసత్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం కొంతమంది తనను సంప్రదించారని పేర్కొన్నారు. అయితే పార్టీలోని సీనియర్ నేతలు అందుకు ఒప్పుకోకపోవడంతో వారు చేసిన అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిపారు. ఒకరు ఎంపీ అయినంత మాత్రాన కుటుంబంలోని వారందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు అవ్వాలా అంటూ పరోక్షంగా కకోలీ ఘోష్‌పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కకోలి టీఎంసీని వీడడంతో తన కుమారుడికి టికెట్ ఇవ్వనందుకే ఎన్డీఏకు మద్దతిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలను బైద్యనాథ్ ఘోష్ ఖండించారు.
పదవి కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని బైద్యానాథ్ చెప్పారు. తన కుటుంబ పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు మమతతో సహా ఇతర నేతలకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. టీఎంసీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వెళ్లిపోవడంతో నిర్మాణాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా మమతా బెనర్జీ పలు మార్పులు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఎంసీ యువజన విభాగం అధ్యక్షురాలిగా నియమించిన వారం రోజులకే.. సయోని ఘోష్ ఎన్డీఏకు మద్దతిస్తున్నట్లు తెలపడంతో ఆమె స్థానంలో పార్టీ నేత అర్నబ్ బెనర్జీని యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నాయి.