ఓవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు తగ్గుతున్న వినియోగం.. ఇంకోవైపు పడిపోతున్న పొదుపు. ఇదీ.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం. తయారీ ఖర్చుల భారాన్ని అన్ని కంపెనీలు కొనుగోలుదారులపైనే వేయటం, పెరిగిన జీవన వ్యయం దెబ్బకు సగటు మనిషి పొదుపు అటకెక్కింది. అసలు దేశంలో సామాన్య ప్రజలు ఎంతటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తాజా సర్వే కండ్లకు కట్టింది.
న్యూఢిల్లీ: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఏం దాచేటట్టు లేదు.. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరల ధాటికి దేశంలో సామాన్యుల పొదుపు ఆశలు గల్లంతవుతున్నాయి. ప్రతి కంపెనీ పెరిగిన తమ వస్తుత్పత్తి తయారీ ఖర్చుల భారాన్ని వినియోగదారుని మీదే వేస్తున్నాయి. ఇది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ప్రభావితం చేస్తున్నది. వినిమయ సామర్థ్యం క్షీణిస్తుండటమేగాక, అవసరాల కోసం గృహస్థులు తమ పొదుపును పక్కనపెడుతున్నారని ఓ తాజా సర్వేలో తేలింది. నువమా ఇన్స్టిట్యుషనల్ ఈక్విటీస్ తన నివేదికలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచుతున్న వడ్డీరేట్లు ద్రవ్యోల్బణాన్ని ఏమాత్రం అదుపు చేయడం లేదన్నది.
కొన్ని రంగాల్లోనే వృద్ధి
దేశంలో వృద్ధిరేటు కొన్ని రంగాలకే పరిమితమైందని, చాలా రంగాలు పతనం దిశగానే పయనిస్తున్నాయని నువమా పేర్కొన్నది. మున్ముందు పారిశ్రామిక వృద్ధిరేటు కూడా మందగమనంలోకి జారుకోవచ్చని చెప్పింది. ఇదే జరిగితే ఉద్యోగుల వేతనాలు, వారి ఆదాయం మరింత దిగజారడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తయారీ రంగం బలహీనపడుతున్నదని, ఇటీవలి జీడీపీ గణాంకాలే ఇందుకు ఉదాహరణ అని నువమా వ్యాఖ్యానించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో ద్రవ్యోల్బణం సగటు 7.2 శాతంగా ఉన్నదని, అంతకుముందు రెండేండ్లు 5.8 శాతంగానే ఉన్నట్టు నువమా గుర్తుచేసింది.
ప్రమాదంలో పొదుపు
అన్ని రంగాల్లోనూ వస్తు ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటం.. ప్రజల పొదుపునకున్న మార్గాలను క్రమేణా మూసేస్తున్నాయి. ప్రధానంగా టెలికం, ఆటో, ఇంధనం, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ధరాఘాతం.. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీంతో సేవింగ్స్‌కు ఉన్న అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నికర ఆర్థిక పొదుపు 30 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ దేశ జీడీపీలో దాదాపు 4 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో దేశ జీడీపీలో 7.3 శాతంగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కరోనా తీవ్రత ఉన్నప్పటికీ 12 శాతంగా కనిపించింది. రోజులు గడుస్తున్నకొద్దీ ప్రజల పొదుపు తగ్గిపోతుండటం ఆందోళనకరం’ అని నువమా తమ తాజా నివేదికలో తెలియజేసింది. అయితే బంగారం, స్థిరాస్తులపై పెట్టుబడులు కొనసాగుతున్నాయని చెప్పింది.
కస్టమర్ల కొనుగోలు శక్తి స్పష్టంగా తగ్గింది. ఇది పెట్టుబడు లను ప్రభావితం చేస్తున్నది.
–నువమా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్
దేశంలో వినిమయ సామర్థ్యం బలహీనపడిందని ఎప్పట్నుంచో చెప్తున్నాం. తాజా గణాంకాల్లోనూ ఇదే స్పష్టమైంది. మార్కెట్లో పరిస్థితులు ఏమంత బాగోలేవు.
–కునాల్ కుందు, సొసైటీ జెనరాలీ భారతీయ ఆర్థికవేత్త
తాజా నివేదిక ముఖ్యాంశాలు