RBI : అమెరికా (USA) కఠిన నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత రూపాయి (Indian rupee) కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత దిగజారకుండా నిరోధించేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు నెలలో ఏకంగా 7.69 బిలియన్ అమెరికన్ డాలర్లను (సుమారుగా రూ.67 వేల కోట్లు) మార్కెట్లో విక్రయించినట్లు ఆర్బీఐ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
ఇటీవల డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 88కి పడిపోయింది. ఆగస్టు నెలలో రూపాయి విలువ 1.6 శాతం వరకు క్షీణించడంతో కేంద్ర బ్యాంక్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. అలాంటప్పుడు ఆర్బీఐ తన విదేశీమారక నిల్వల నుంచి డాలర్లను అమ్ముతుంది. దాంతో మార్కెట్లో డాలర్ల సరఫరా పెరిగి, రూపాయి విలువ స్థిరపడుతుంది.
జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో ఆర్బీఐ విక్రయించిన డాలర్లు ఏకంగా మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. మార్కెట్లో తీవ్రమైన అనిశ్చితి ఉన్నప్పుడు మాత్రమే తాము జోక్యం చేసుకుంటామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవైపు డాలర్లను విక్రయిస్తూనే మరోవైపు ఆర్బీఐ వ్యూహాత్మకంగా బంగారం నిల్వలను పెంచుకుంటోంది. రెండు నెలల విరామం తర్వాత సెప్టెంబర్‌లో కొత్తగా 200 కిలోల పసిడిని కొనుగోలు చేసింది.
దాంతో ఆర్బీఐ దగ్గరున్న మొత్తం బంగారం నిల్వలు 880.18 టన్నులకు చేరాయి. వాటి విలువ సుమారు రూ. 8.36 లక్షల కోట్లుగా ఉంది. ఏ దేశ కేంద్ర బ్యాంకు వద్దనైనా బంగారం నిల్వలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీపై అంతర్జాతీయంగా నమ్మకం పెరుగుతుంది. సంక్షోభ సమయాల్లో బంగారం సురక్షితమైన ఆస్తిగా పనిచేస్తుంది. విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వంటి కరెన్సీలు ఉన్నప్పటికీ, బంగారం నిల్వలు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇస్తాయి.
అధిక బంగారం నిల్వలు దేశ రేటింగ్ మెరుగుపడటానికి కూడా దోహదపడతాయి. తద్వారా తక్కువ వడ్డీకే అంతర్జాతీయ రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చేపడుతున్న ద్వంద్వ వ్యూహం రూపాయిని బలోపేతం చేయడానికేనని విశ్లేషకులు భావిస్తున్నారు.