కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ సింగ్ రావత్ వ్యవహారం కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి చేరింది. అయితే దీనిపై కాంగ్రెస్ చాలా స్పష్టమైన వైఖరితోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానంపై ఒత్తిడి తేవడానికే రావత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా అధిష్ఠానం భావనగా ఉందని ఓ సీనియర్ నేత పేర్కొంటున్నారు. వచ్చే యేడాదిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ ప్రకటించాలన్న ఏకైక లక్ష్యంతోనే రావత్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు తప్పించి, అంతకు మించి ఏదీ లేదన్నది అధిష్ఠానం ఆలోచన. ఎన్నికల సమయంలో టిక్కెట్ల పంపిణీ, జిల్లాల అధ్యక్షుల నియామకం లాంటివి తన చేతుల మీదుగా జరగాలన్న పట్టుదలలో రావత్ ఉన్నారని, అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహంలోనే రావత్ వ్యాఖ్యలను చూస్తున్నట్లు సమాచారం.
జనవరి 5 న కీలక ప్రకటన చేయనున్న రావత్
అయితే రావత్‌తో సన్నిహితంగా మెలిగే వర్గం వాదన మరోలా ఉంది. రావత్ వచ్చే యేడాది రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతున్నారని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని జనవరి 5న రావతే స్వయంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రావత్ మొత్తానికే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధపడిపోయారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.