న్యూఢిల్లీ, జనవరి 2: పెద్ద నోట్ల రద్దును సుప్రీం కోర్టు సమర్థించిందని చెప్పడం సరికాదని, ఇలా చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని కాంగ్రెస్ పేర్కొంది. కేవలం పెద్ద నోట్ల రద్దు చేసిన ప్రక్రియను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుందని, దాని పర్యవసానాలను తీసుకోలేదని ఆ పార్టీ నేతలు అన్నారు. నోట్ల రద్దు ద్వారా అనుకున్న లక్ష్యాలు నెరవేరాయా, లేదా అన్నది ఈ తీర్పులో లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలోని న్యాయ విరుద్ధమైన అంశాలను కోర్టు ఎత్తిచూపిందని, ఇది ప్రభుత్వానికి మొట్టికాయ వేసినట్లేనని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎద్దేవా చేశారు.
ఆర్థిక సంక్షోభానికి కారణమైంది
పెద్దనోట్ల రద్దు విషయంలో కేవలం న్యాయ, సాంకేతిక అంశాలనే కోర్టు చూసిందని కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశం ఆర్థికంగా దెబ్బతిన్నదని, ఆర్థిక సంక్షోభానికి, మందగమనానికి ఈ నిర్ణయం కారణమైందని ఆయన గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్తారా ?
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించడం హర్షణీయమని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఉగ్రవాద నిధులను ఈ నిర్ణయం కట్టడి చేసిందని ఆయన అన్నారు.