గ్వాలియర్, జూన్ 12: మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితులు రోగులు, వారి సహాయకుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. గ్వాలియర్ ప్రభుత్వ దవాఖానాలో ఎలుకలు రోగుల పడకలు, కుర్చీలపై ఇష్టమున్నట్టు సంచరిస్తున్నాయి. మందులు, ఆహార పొట్లాలను లాక్కెళ్లుతున్నాయి.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఇదీ పరిస్థితి..అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. దీనిని చూసిన నెటిజన్లు, దవాఖాన నిర్వహణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖానలో రోగుల కన్నా ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ సర్కార్ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించింది. కాగా, ఎలుకల నియంత్రణపై చర్యలు చేపట్టాలని వైద్య అధికారిని ఆదేశించినట్టు మెడికల్ కాలేజీ డీన్ ఆర్కేఎస్ ధాకడ్ చెప్పారు.