Ratan Tata |నమ్మకంతో కూడిన నాయకత్వం.. టాటా గ్రూపు నినాదం. ఈ నమ్మానికి నైతిక విలువలను జోడించారు రతన్ టాటా. 1868లో అంటే 154 ఏండ్ల కిందట ఒక స్టార్టప్‌గా ప్రస్థానం ప్రారంభించిన టాటా గ్రూపు ఇప్పుడు గ్లోబల్ కంపెనీల్లో ఒకటిగా ఊహించని స్థాయికి ఎదిగింది. దీని వెనుక సంస్థ వ్యవస్థాపకుడు జెమ్ షెట్ జీ టాటా కృషి ఎంత ఉందో.. ఆయన మునిమనువడు రతన్ టాటా పట్టుదల కూడా అంతే ఉంది. ఆ విధంగా రతన్ టాటా తన సంస్థ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అత్యంత గౌరవించదగ్గ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా ఇవాళ 86వ పడిలోకి అడుగుపెట్టారు.
రతన్ టాటా 1937, డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. రతన్ తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద పెరిగారు. రతన్ టాటా ఇప్పటికీ అవివాహితుడు. నాలుగు సార్లు పెళ్లి దాకా వచ్చారు కానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాలేదు. లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఒకమ్మాయితో ప్రేమలో పడ్డాను అని టాటా చెప్పారు. 1962 ఇండో – చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఇండియాకు పంపించేందుకు అంగీకరించలేదు. అలా లవ్ మ్యారేజ్‌కు బ్రేక్ పడిందని తెలిపారు.
రతన్ టాటా 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ అయ్యారు. రెండేండ్లు తిరిగే సరికి 1983లో సాల్ట్(ఉప్పు) ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తొలిసారిగా అయోడైజ్డ్ ఉప్పును ప్రవేశపెట్టారు. టాటా నామక్ – దేశ్ కా నామక్ ప్రచారంతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక 2009లో రతన్ టాటా సామాన్యుల కోసం రూ. లక్షకే నానో పేరుతో చీపెస్ట్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. 2000 ఏడాదిలో రతన్ టాటాకు కేంద్రం పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.