న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్వహించిన దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తాను జీవించినంత కాలం మానవతామూర్తిగా, దాతృత్వానికి మారుపేరుగా నిలిచారు. ఆయన దాతృత్వం ఖండాంతరాలలో ఖ్యాతిని తెచ్చింది. ఆయన ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా దాతృత్వం తన శాశ్వత వారసత్వంగా నిలిచిపోయింది. తన తదనంతరం సంపదలో అత్యధిక వాటాను దాతృత్వానికే కేటాయించారు. ఈ మేరకు ఆయన వీలునామా రాసిపెట్టినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక మంగళవారం వెల్లడించింది. రతన్ టాటా నిరుడు అక్టోబర్ 9న కన్నుమూశారు.
తన సంపదలో అత్యధికంగా తాను నెలకొల్పిన చారిటీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్లకు కేటాయించినప్పటికీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, పెంపుడు జంతువులను ఆయన మరిచిపోలేదు. ఇక తన విల్లును ఎవరైనా సవాలు చేస్తే వారికి ఎటువంటి హక్కులు లేదా వాటా కూడా లభించబోదు అని కూడా ఆయన షరతు విధించారు. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌కు రూ.3,800 కోట్ల విలువైన సంపదను ఆయన కేటాయించారు. ఈ రెండు దాతృత్వ సంస్థలు కాగా, అవి తమకు లభించిన నిధులను దాతృత్వ ప్రయోజనాలకు ఉపయోగించాలి.
ఇక తన సవతి సోదరీమణులు షిరీన్ జెజీభోయ్, డియానా జెజీభోయ్లకు రూ.800 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వస్తువులను అందించాలని తన వీలునామాలో పేర్కొన్నారు. తన సోదరుడు 82 ఏండ్ల జిమ్మీ నావల్ టాటాకు జుహు బంగళాలో కొంత వాటా, వెండి వస్తువులు, కొన్ని ఆభరణాలను అందించాలని తెలిపారు. తన సన్నిహిత మిత్రుడు మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్ ఆస్తులు, మూడు తుపాకులు అందించారు. జంతువుల పట్ల రతన్కున్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఆయన వాటి కోసం దవాఖానలనే నెలకొల్పారు. వాటి కోసం ఆయన రూ.12 లక్షల నిధిని ఏర్పరిచారు. వీటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి వాటి సంరక్షణ కోసం ఒక్కో జంతువుకు రూ.30 వేలు ఖర్చు చేయాలని సూచించారు. తనకు చివరి దశలో స్నేహితునిగా, మేనేజర్‌గా వ్యవహరించిన శంతను నాయుడుకు ఇచ్చిన విద్యా రుణాన్ని మాఫీ చేశారు. తన ఇంటికి పొరుగున ఉన్న జేక్ మాలైట్కు ఇచ్చిన విద్యా రుణాన్ని కూడా ఆయన రద్దు చేశారు.