ముంబై , జనవరి 18 (నమస్తే తెలంగాణ): కుడి వైపున గుండె ఉన్న 70 సంవత్సరాల మహిళకు అరుదైన ఆపరేషన్ చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. ఇంటి పని చేస్తున్నప్పుడు మహిళకు ఛాతీ నొప్పి మొదలైంది. ఆమెను నాగ్‌పూర్‌లోని లతామంగేషర్ దవాఖానకు తీసుకువెళ్లగా, పరీక్షించిన వైద్యులు ఆమె గుండె ఎడమ వైపు కాకుండా కుడి వైపున ఉందని తెలియడంతో ఆశ్చర్యపోయారు. గుండెలోని ప్రధాన రక్తనాళం 90 శాతం మూసుకుపోవడంతో నిపుణులు యాంజియోప్లాస్టీని విజయవంతంగా చేశారు. ప్రపంచంలో 70 ఏండ్ల వయసులో కుడివైపున గుండె ఉందని నిర్ధారించిన కేసు ఇది బహుశా మూడవ లేదా నాల్గవది కావచ్చునని, గుండె కుడి వైపు ఉండటం భారతదేశంలో మొదటిది అని వైద్యులు చెప్పారు. సాధారణ రోగుల్లో ఈ ఆపరేషన్ 30 నిమిషాలు పడుతుందని, అయితే, ఈ శస్త్రచికిత్స జాగ్రత్తగా చేయాల్సి ఉన్నందున గంట సమయం పట్టిందని డాక్టర్ భగవతర్ చెప్పారు.