పతనంతిట్ట, నవంబర్ 29: కరోనా ఆంక్షల ఎత్తివేత తర్వాత అయ్యప్ప భక్తులు శబరిమలకు పెద్ద సంఖ్యలో రానుండడంతో వారికి అత్యవసర చికిత్స అందేలా కేరళ సర్కారు ఏర్పాట్లు చేసింది. తక్షణ వైద్యం అందిం చేందుకుగానూ ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇరుకైన మార్గాల్లోనూ ప్రయాణించగలిగే బైక్ ఫీడర్ అంబులెన్స్‌తోపాటు రెస్క్యూ వ్యాన్, ఐసీయూ అంబులెన్స్ ఇందులో ఉంటాయని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీనిని ‘కానివ్ 108’ అంబులెన్స్ ప్రోగ్రామ్ కింద పర్యవేక్షిస్తారని చెప్పారు. ఈ మూడు వాహనాల్లోనూ ఆక్సిజన్ సౌకర్యం ఉంటుం దని తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు శ్వాస సంబంధ సమస్యలు, ఛాతిలో నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయగానే ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ యూనిట్ వాహనాలు అక్కడికి చేరుకుంటాయన్నారు. ఉన్నచోటే చికిత్సను అందిస్తాయని చెప్పారు.