భువనేశ్వర్: అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తి, ఆ బాధితురాలిని జైళ్లో పెళ్లి చేసుకున్నాడు. జైలు అధికారులు దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి మరీ వారి పెళ్లి జరిపించారు. వివాహం తర్వాత వధువు ఇంటికి వెళ్లగా వరుడు కారాగారంలోకి వెళ్లాడు. (Rape Accused Marries Survivor In Jail) ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గొచ్చబడి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సూర్యకాంత్ బెహెరా, 22 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. అయితే ఆమెను పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడు. దీంతో సూర్యకాంత్ తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్లో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. నాటి నుంచి కోడెలలోని సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
కాగా, సూర్యకాంత్, బాధిత మహిళ కుటుంబాల మధ్య రాజీ కుదిరింది. ఈ నేపథ్యంలో వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. జైలు అధికారుల నుంచి అనుమతి పొందారు. దీంతో జైల్లోనే గ్రాండ్గా పెళ్లి జరిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి కోసం జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జైలు ప్రాంగణాన్ని వివాహ వేదికగా అలంకరించారు.
మరోవైపు ఆదివారం వరుడుగా ముస్తాబైన సూర్యకాంత్ జైలు అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. జైలు అధికారులు, ఇరు కుటుంబాలు, కొందరు బంధువుల సమక్షంలో వధువు మెడలో తాళికట్టాడు. ఆ జైలులోని వృద్ధులు ఈ జంటను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత వధువు తన ఇంటికి వెళ్లగా, వరుడు జైలులోకి వెళ్లాడు.
కాగా, పెళ్లి ఖర్చులన్నీ ఇరు కుటుంబాలే భరించాయని జైలు అధికారి తెలిపారు. తాము కేవలం ఏర్పాట్లు మాత్రమే చేసినట్లు చెప్పారు. అయితే తన కుమారుడు త్వరలో జైలు నుంచి విడుదలై సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని గడుపుతాడని తాము ఆశిస్తున్నామని సూర్యకాంత్ తండ్రి భాస్కర్ బెహెరా తెలిపాడు.