Ramesh Chennithala : కేరళ సీఎం ఎంపిక విషయంలో కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. వీడీ సతీష్‌ను కేరళ సీఎంగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం పదవి కోసం పోటీపడ్డ అభ్యర్థుల్లో ఆయన కూడా ఒకరు.
తనకు కాకుండా సతీషన్‌ను సీఎంగా ఎంపిక చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే నేరుగా రమేష్‌కు ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ రమేష్ తన అసంతృప్తిని బయటపెట్టారు. తాజా సమాచారం ప్రకారం.. ఆయన పార్టీ లెజిస్లేటివ్ మీటింగ్‌కు హాజరుకావడం లేదు. అలాగే, క్యాబినెట్లో కూడా చేరకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీకి పార్టీలో ప్రాధాన్యం లేదని ఆయన ఆవేదన చెందుతున్నట్లు ప్రచారం. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం రమేష్ ఎలాంటి అసంతృప్తికి లోనవడం లేదని చెబుతున్నారు.
ఆయన హైకమాండ్ వద్ద ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని అంటున్నారు. కేరళలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముందుగా లెజిస్లేటివ్ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరేది తెలుస్తుంది. కేరళ సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జనలు పడింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కలిసి అనేక చర్చల అనంతరం సీఎంను ఎంపిక చేశారు. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి 102 సీట్లు దక్కాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లు దక్కాయి.